బస్సు చక్రం క్రిందపడి చిన్నారి మృతి
నల్గొండజిల్లాలో విషాదం;
స్కూల్ బస్సు చక్రాల క్రింద పడి తెలంగాణలో ఓ చిన్నారి గురువారం ప్రాణాలు కోల్పోయింది. స్కూల్ బస్సు డ్రైవర్ చిన్నారిని చూసుకోకుండానే బస్సును రివర్స్ గేర్ లో నడిపించాడు. పర్యవ్యసానంగా అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబలించింది.
నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. స్కూల్ బస్సు చక్రాల క్రిందపడి ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. దేవరకొండ రహదారిపై ఉన్న ప్రైవేట్ స్కూల్ ప్రాంగణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన బాలికను జస్మిత (4)గా గుర్తించారు. చిన్నారిని పాఠశాల సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్దారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆర్తనాదాలు చేశారు.
గత నెలలో ఇదే తరహా ప్రమాదం జనగామలో చోటు చేసుకుంది. జనగామ మండలం అడవికేశ్వాపూర్‌కు చెందిన వరుణ్‌తేజ్(6) ను స్కూల్ లో చేర్పించాలని తల్లిదండ్రులు అడ్మిషన్ తీసుకోవడానికి జనగామలోని గౌతమి మోడల్ స్కూల్‌కు వచ్చారు. ఒకటో తరగతి అడ్మిషన్ అయితే దొరికింది గానీ తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుంటే ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి గ్రామానికి చేరుకున్న వరుణ్‌తేజ్ బస్సులో నుంచి దిగుతుండగా బ్యాగు బరువెక్కువై బస్సు వెనక చక్రం క్రింద పడిపోయాడు. డ్రైవర్ ఇది గమనించలేదు. బస్సును ముందుకు పోనిచ్చాడు. బాలుడి తలపై నుంచి బస్సు చక్రం క్రిందపడి అకడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి బంధువులు స్కూలు బస్సు అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై ఆందోళన చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనా కారులను శాంతింజేశారు.
నెల రోజుల వ్యవధిలో ఇద్దరి చిన్నారులను చిదిమేసిన స్కూల్ బస్సు ఘటన పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు