చిరంజీవి సన్మానం పేరిట లండన్ లో డబ్బులు వసూలు
ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం చిరంజీవికి తెలిసి ఆయన చాలా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.;
By : The Federal
Update: 2025-03-21 06:05 GMT
Chiru
బ్రిటన్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రోగ్రాంకి డబ్బులు వసూలు చేసి ఆయన పేరు ప్రతిష్టలకు మచ్చ తెచ్చారా? హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్‌లోని ఓ హాలులో ఇటీవల చిరంజీవి సత్కార సభ జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ క్రమంలో చిరంజీవి లండన్ టూర్‌ను కొందరు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఫ్యాన్ మీట్ పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. ఈ విషయం చిరంజీవికి తెలిసి ఆయన చాలా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్ మీటింగ్ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. ఇలాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం
- సోషల్ మీడియా ఎక్స్ లో చిరంజీవి
యూకే పార్లమెంట్‌లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. ఇది జరిగిన రెండో నాడే డబ్బులు వసూలుపై కూడా చిరంజీవి ట్వీట్ చేయడం గమనార్హం.