Revanth Reddy | ‘అందరి జాతకాలు నా దగ్గరున్నాయి’

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఈరోజు నూతన సంవత్సరం సందర్బంగా ఎమ్మెల్యేలు, మంత్రులు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.;

Update: 2025-01-01 15:40 GMT

ప్రతి ఎమ్మెల్యే, మంత్రి జాతకాలు తన దగ్గర ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ప్రతి ఒక్కరూ మరింత మెరుగ్గా పనిచేయాలన ఆయన సూచించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఈరోజు నూతన సంవత్సరం సందర్బంగా ఎమ్మెల్యేలు, మంత్రులు.. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా వారికి సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి జాతకం తన దగ్గర ఉందన్నారు. తాను మారానని.. మిగిలిన నేతలు కూడా మారాలని కోరారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. ప్రజలకు మార్పు కోరుకుని కాంగ్రెస్‌కు అధికారం అందించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుదామని తెలిపారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

రిపోర్ట్‌లు నా దగ్గరున్నాయి

‘‘నేను మారినా... మీరు మారండి.. ఇవాళ మంత్రులు అందరికి నేనే ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినా. .ఎమ్మెల్యేల పని తీరు... ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించా. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండండి. ఏడాది పాలనలో మనకు తెలిసి తప్పు చేయలేదు... తెలియకుండా జరిగిన తప్పులపై చర్యలు తీసుకున్నాం. ఏడాది పాలన అనుభవాలు... వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడతాయి’’ అని తెలిపారు. ఈ సందర్బంగా అంగన్ వాడి... డీలర్ల నియామకంలో పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వండని ఓ మంత్రి సీఎంను కోరారు. కాగా ఆన్లైన్‌లో దరఖాస్తులు తీసుకుని... పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న సిఎం రేవంత్ వివరించారు.

గత ప్రభుత్వం చేయలేదు

‘‘ఉపాధ్యాయుల నియామకం.. ప్రమోషన్‌ల విషయంలో ఎందుకు వచ్చిన లొల్లి అనుకుని గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ మనం ఎవరికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేశాం. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా. మీరు నన్ను ఏవిధంగా అనుకుంటారో... మిమ్మల్ని మీ కింది నాయకులు అలాగే అనుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా కీలకం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి.... అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే సమాచారం నా దగ్గర ఉంది. మార్పు కోసం మనకు ప్రజలు అధికారం ఇచ్చారు. మాట నిలబెట్టుకుందాం..కష్టపడి పనిచేద్దాం. మరింత పట్టుదలగా పనిచేయండి. ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు గుర్తించారు. ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారు. సమస్యలను అధిగమించేందుకు బీఆర్ఎస్ దుష్పచారాన్ని తిప్పికొట్టండి. మరింత చిత్తశుద్ధి పనిచేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయండి. ప్రతిఒక్కరు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలి’’ అని తెలిపారు.

Tags:    

Similar News