రేవంత్ ఆహ్వానాన్ని అధినేత్రి అంగీకరించారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Update: 2024-05-28 14:39 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రజల తరఫున సోనియా గాంధీని ఆహ్వానించానని చెప్పారు. హాజరయ్యేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని సీఎం రేవంత్ అన్నారు.

ఢిల్లీ వేదికగా మోడీపై సీఎం విమర్శలు...

"ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీకి పాకిస్తాన్ గుర్తు వస్తుంది. పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరు వెళ్లారు? మోడీ ఇష్టం మేరకు వెళ్లి పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారని" రేవంత్ విమర్శించారు. "ధరల పెరుగుదల నిరుద్యోగం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం అంశాలను లేవనెత్తితే బిజెపికి పాకిస్తాన్ గుర్తు వస్తుందన్నారు. పదేళ్ల దేశ పురోగతి ప్రోగ్రస్ కార్డు బిజెపి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని కుర్చీని కాంగ్రెస్ ఎప్పుడూ అగౌరవ పరచలేదన్నారు. పదేళ్ల పాలన వైఫల్యాలను కప్పించుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

"డిపాజిట్లు కూడా రానిచోట మెజారిటీ సీట్లు వస్తాయని బిజెపి బీరాలు పలుకుతుంది. మోడీ గ్యారెంటీ కి సంబంధించిన వారంటీ ఖతం అయ్యింది. బిజెపి మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరు. దేశ ప్రజలు బిజెపిని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని" సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

సోనియా చేతుల మీదుగా రాష్ట్ర గీతం ఆవిష్కరణ...

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందెశ్రీ రచించి, కీరవాణి కంపోజ్ చేసిన రాష్ట్ర గీతాన్ని ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకే సోనియాని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ నేడు ఢిల్లీ వెళ్లారు. కాగా, సోనియా రాకని బీజేపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఒక పార్టీ అధినాయకురాలిని ఏ హోదాలో ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానిస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి.

Tags:    

Similar News