‘కుర్చీని కాపాడుకోవడంలో రేవంత్ బిజీ బిజీ’

రాష్ట్రంలో పాదయాత్ర చేయలేని దుస్థితిలో సీఎం ఉన్నారంటే.. పాలన ఎవరు చేస్తున్నారో?;

Update: 2025-07-29 10:56 GMT

కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది బీసీల రిజర్వేషన్లు కాదని ముస్లింల రిజర్వేషన్లు అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పాదయాత్ర చేయలేని స్థితి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయాలని నిర్ణయించడమే దీనికి నిదర్శనం. ఇది ఖమ్మం బ్యాచ్, నల్లగొండ బ్యాచ్ అనే రెండు వర్గాలు ముఖ్యమంత్రిని పనిచేయనివ్వకపోవడమే కారణం’ అని రామచందర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న రామచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘ఖమ్మం జిల్లాలో బీజేపీ మరింత బలపడుతోంది. ఇప్పటి వరకు ఈ జిల్లా కమ్యూనిస్టుల గడ్డగా భావించేవారు. అయితే రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డాగా మారనుంది. వెస్ట్ బెంగాల్‌లో అనేకమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. ఖమ్మం జిల్లాలో కూడా కమ్యూనిస్టు కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ దేశాన్ని, సమాజాన్ని, ప్రజలను కాపాడగల శక్తి ఒక్క భారతీయ జనతా పార్టీదే. అందరం కలిసి దేశం కోసం, జాతి కోసం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేయాలి. కమ్యూనిస్టు సిద్ధాంతం ఇప్పుడు పూర్తిగా విఫలమైంది. ప్రపంచ వ్యాప్తంగా వారు క్షీణించిపోతున్నారు. ఒకటిరెండు చోట్ల మాత్రమే గెలుస్తున్నారు’’ అని తెలిపారు.

‘‘వెస్ట్ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ క్రమంగా బలపడుతోంది. అక్కడ బీజేపీ సీట్లు గణనీయంగా పెరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను జోడించే ప్రయత్నం చేస్తోంది. దీనిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ భేషరతుగా మద్దతు తెలిపింది. కాంగ్రెస్ తెచ్చిన బిల్లులో న్యాయపరమైన లొసుగులు ఉన్నాయని ప్రజలకు అర్థమైందనే, దానిని షెడ్యూల్ 9లో చేర్చాలని కేంద్రాన్ని నిందిస్తూ తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని ఆరోపించారు.

‘‘కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చిందని గుర్తించుకోవాలి. అందుకే ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అందులో ఒక్కశాతం తగ్గినా బీజేపీ ఊరుకోదు. కాంగ్రెస్ తీసుకొచ్చినది బీసీల రిజర్వేషన్ల బిల్లు కాదు – ముస్లింల రిజర్వేషన్ల బిల్లు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఇప్పటికే ఈబీసీ కోటాలో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అదనంగా తెలంగాణలో మరో 4 శాతం రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. ఈ అంశం కోర్టులో పరిష్కారం కోసం ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేసినా, అందులో 35 సీట్లు ముస్లింలు గెలిచారు. బీసీలకు కేటాయించిన సీట్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో గౌడ్, యాదవ వంటి బీసీ సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది’’ అని అన్నారు.

‘‘ఇలా బీసీలను పదేపదే మోసం చేస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయలేకపోతున్న పరిస్థితిలో, బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయాలని చూస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లో ఉన్న వివరాలను ఎందుకు ప్రజలకు వివరించడంలేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయ్యాయి. కానీ బీసీలతో పాటు ఇతర అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చిన అనేక హామీల్లో ఏ ఒక్కదాన్నీ కూడా అమలు చేయలేదు. రైతుబంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కేవలం రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధులను విడుదల చేసింది. ఖమ్మం చుట్టూ నాలుగు జాతీయ రహదారులు, గ్రీన్ వేలు మంజూరు చేయడం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కృషి చేసింది. ఖమ్మం నగర అభివృద్ధికి రూ.450 కోట్లు కేటాయించింది’’ అని వెల్లడించారు.

‘‘వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు అవసరమైన యూరియాను మించి కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో షార్టేజ్ ఎందుకు జరుగుతోంది అనే విషయంపై విచారణ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో రైతులు ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొనేవారు. అప్పట్లో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తేది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, యూరియా కొరత ఉండకుండా ప్రతి గ్రామానికి అందుబాటులో ఉండేలా నీమ్ కోటెడ్ యూరియాను పంపిణీ చేస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రాంచందర్ రావుకు అవగాహన లేదని మాట్లాడుతున్నారు. అందుకే ఇక్కడ వాస్తవ లెక్కలు వెల్లడిస్తున్నాను. కనీసం ఇప్పటికైనా ఆయన తెలుసుకోవాలి’’ అని సూచించారు.

‘‘రబీ సీజన్‌ కోసం తెలంగాణకు అవసరమైన యూరియా: 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. కేంద్రం పంపిన యూరియా: 12.02 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది అవసరానికి మించి తెలంగాణకు పంపిణీ చేసిన అదనపు యూరియా సరఫరా. అయినా కొరత ఎందుకు ఏర్పడుతోంది? ఎరువుల దుకాణాలను నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఎరువులపై సబ్సిడీ పెంచుతోంది. 2024 వరకు సుమారు రూ.1.94 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో రైతులకు అందించింది. ఒక 45 కిలోల ఎరువు బస్తాపై వాస్తవ ధర: రూ.1690. కేంద్ర సబ్సిడీ: రూ.1423.50. రైతుకు లభించే ధర: కేవలం రూ.266.50 మాత్రమే. దీంతో రైతు చెల్లించేది కేవలం రూ.266.50 కాగా, కేంద్రం భరిస్తున్నది రూ.1423.50.’’ అని తెలిపారు.

‘‘డీఏపీ ఎరువు వాస్తవ ధర: రూ.2445.55. కేంద్ర సబ్సిడీ: రూ.1095.55. రైతుకు అమ్మే గరిష్ఠ ధర: రూ.1350 మాత్రమే. రైతు రూ.1350 చెల్లిస్తే సరిపోతుంది. కేంద్రం రూ.1095.55 చెల్లిస్తోంది. అసలు ఖర్చు రూ.2445.55. ఈ లెక్కలు తప్పని నిరూపించగలిగితే నేను రాజీనామా చేస్తాను. లేకపోతే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతూ రైతులను తప్పుదారి పట్టిస్తోంది. యూరియా రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కు వెళ్తుండటానికి కారణం అదే. బీజేపీ రైతుల పక్షాన నిలిచే పార్టీ. బీసీల పక్షాన పోరాటం చేసే పార్టీ. ప్రజల పక్షాన మాట్లాడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజావ్యతిరేక విధానాల పార్టీ. ప్రజలు గతంలో బీఆర్ఎస్‌ను తిరస్కరించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించేందుకు ఎదురు చూస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది’’ అని తెలిపారు.

‘‘రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించబోతోంది. ఖమ్మం మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులనూ బీజేపీయే గెలుచుకుంటుంది. జిల్లా పరిషత్‌లో ఎక్కువ ఎంపీటీసీలు బీజేపీ గెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ కోసం పనిచేసి, పార్టీ బలోపేతానికి కృషి చేసి, పార్టీని గెలిపించేందుకు శ్రమించాలి. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా అందించాలి’’ అని కోరారు.

Tags:    

Similar News