‘తెలంగాణకు రక్షణ భూములు ఇవ్వండి..’
నేపాల్‌లో సంక్షోభం తాండవిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రకటించింది.;
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం 98.20 ఎకరాల రక్షణశాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. మంగళవారం రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే తెలంగాణలో చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై సమగ్రంగా వివరించారు. ఈ రెండు నదుల సంగమ స్థలంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని వివరించారు.
నేపాల్ సంక్షోభంతో తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్లు..
నేపాల్‌లో తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. ప్రధాని రాజీనామా చేయగా, ఆందోళన కారులు పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటితో నేపాల్‌లో పరిస్థితులు గందరోగోళంగా ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ నివాసం ఉంటున్న తెలంగాణ వాసుల కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు సహాయం చేయడం, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కోసం రేవంత్ సర్కార్ హెల్ప్‌లైన్ ప్రకటించింది. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం, తెలంగాణ పౌరులెవరూ గాయపడినట్లు లేదా తప్పిపోయినట్లు సమాచారం లేదు. ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.