ఎస్‌ఎల్‌బీసీలో శాశ్వత చర్యలపైనా ఫోకస్ పెట్టాలి: రేవంత్
అవసరం అనుకుంటే ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయాలి. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని రేవంత్ తెలిపారు.;
శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ నిర్మాణంలో అపశృతి జరిగింది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో ఎనిదిమంది కార్మికులు చిక్కుకున్నారు. ఈ ఘటన జరిగిన నెల పూర్తయింది. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఒకే ఒక్క కార్మికుడి మృతదేహాన్ని అధికారులు వెలికి తీశారు. ఆ తర్వాత ఎవరి జాడ దొరికిన దాఖలాలు కూడా లేవు. కాగా తాజాగా ఎస్‌ఎల్‌బీసీలో జరుగుతున్న సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. గల్లంతైన కార్మికుల జాడను వీలైనంత త్వరగా గుర్తించాలని చెప్పారు.
‘‘సొరంగంలో చిక్కుకున్న వారి మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికితీయాలి. తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత చర్యలపైనా ఫోకస్ పెట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులను ముందుకెళ్లాలి. అవసరం అనుకుంటే ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయాలి. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్స్‌లో భాగంగా డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని అనుసరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఉన్నత స్థాయి కమిటీ సచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం.. గల్లంతయిన ఏడుగురు బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా కూడా సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.