ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం: రేవంత్
ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చన్నారు రేవంత్.;
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై చర్చించడానికి అఖిల పక్షాలతో కలిసి రావడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ ప్రధాని మోదీని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా ఈ నేపథ్యంలోనే ముంగళవారం తెలంగాణ బీసీ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ సమావేశామయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రధాని మోదీని కలవడం, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు అభినందనలు తెలపాల్సింది తనకు కాదని, రాహుల్ గాంధీకని రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులసర్వే నిర్వహించాం. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలి. ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలి.. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుంది. అందుకే రాష్ట్రంలో బీసీ కులసర్వే నిర్వహించుకున్నాం. అసెంబ్లీలో ఫిబ్రవరి 4 కు ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఫిబ్రవరి 4 ను సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నాం. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్ లో కులసర్వే పూర్తి చేశాం. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించాం’’ అని వివరించారు.
‘‘పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశాం. ఏ పరీక్షలోనైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలనేదే మా ఆలోచన. ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇందులో మేం భాగస్వాములవడం మాకు గర్వకారణం. దీనిని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలి.. దీన్ని తప్పుపడితే నష్టపోయేది బీసీ సోదరులే. కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నాం. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదు… జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుంది’’ అని అన్నారు.
‘‘మండల్ కమిషన్ కూడా బీసీల లెక్క 52 శాతం అని తేల్చింది. కానీ మేం కులసర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేల్చాం. లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలు వాయిదా వేశాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంది. పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే. ఈ కులగణన అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ఈ కులగణన పునాది లాంటిది.. ముందు అమలు చేసుకుని తరువాత అవసరాన్నిబట్టి సవరణలు చేసుకోవచ్చు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్ లో పడకండి. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే.. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్నవారవుతారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించండి నేను మీకు మద్దతుగా నిలబడతా’’ అని హామీ ఇచ్చారు.