‘తెలంగాణకు ఆర్థిక చేయూత చాలా అవసరం’
2047 నాటికి జాతీయ జీడీపీకి తెలంగాణ 8 శాతం, అంటే 2.4 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసి తెలంగాణ జాతీయ లక్ష్యాలకు చోదకంగా నిలబడుతుంది.;
భారత్ మరింత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు సాగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం, సమాఖ్య స్ఫూర్తి అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలను కేవలం ప్రయోగశాలలుగా మాత్రమే కాకుండా జాతీయ వృద్ధికి అవసరమైన చోదక శక్తిగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సహకార ఫెడరలిజమ్ శక్తిని వినియోగించి సమానత్వం, న్యాయం, శ్రేయస్సుతో పాటు అందరికీ సమాన అవకాశాలు అందించే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10 వ సమావేశంలో రేవంత్ కూడా పాల్గొన్నారు. దేశ సమగ్రాభివృద్ధి, తెలంగాణ పునర్నిర్మాణానికి అనుసరిస్తున్న విధివిధానాలు, భవిష్యత్తు లక్ష్యాలను సమగ్రంగా వివరించారు. తెలంగాణ రైజింగ్‌తో ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న తెలంగాణ మాడల్‌ను సమావేశంలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో చేపట్టిన అనేకానేక కార్యక్రమాలను సమగ్రంగా వివరించి అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఆర్థిక చేయూతను అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఆర్థిక, పాలనాపరమైన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ వేదిక నుంచి మాట్లాడటం గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
“పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ సాయుధ దళాలు చేపట్టిన ప్రతి చర్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. దేశంలో శాంతి, ఐక్యతను కాపాడుకోవాలన్న సంకల్పానికి తెలంగాణ కట్టుబడి ఉంది. మన వీరుల ధైర్యానికి, త్యాగాలకు వందనాలు. 1971 లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో దేశానికి చిరస్మరణీయ విజయం అందించిన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవడం సముచితం” అని అన్నారు.
“దేశ స్వాతంత్రం సాధించి వందేళ్లయ్యే 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో కూడిన వికసిత్ భారత్ లక్ష్యాలను నిర్ధేశించుకోవడం స్ఫూర్తి దాయకం. ఆ లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం మనకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో ముందువరుసలో నడవడానికి కీలక పాత్ర పోషించడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది. దేశం రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర, స్థిరమైన అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారమవుతుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుంది. ఈ సమయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతుగా నిలవడంతో పాటు ఆయా రాష్ట్రాల సామర్థ్యాలను ఉపయోగించుకోవడం అత్యవసరం. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలకు అవసరమైన ప్రతి సహాయాన్ని కేంద్రం అందించాలి. రాష్ట్రాల మధ్య సమతుల్యత చాలా కీలకం’’ అని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రేవంత్ ఇంకా ఏమన్నారంటే..
వికసిత్ భారత్‌కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం తరఫున, ప్రజల తరఫున తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో మా కార్యాచరణ పథకాన్ని సమర్పిస్తున్నాను. మా ఆకాంక్షలు, దృఢ సంకల్పానికి ఈ రోడ్ మ్యాప్ ప్రతిబింబిస్తుంది. మేం సంకల్పించిన సాహసోపేతమైన మార్పును సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ విషయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలని మేం ఆకాంక్షిస్తున్నాం.
వన్ ట్రిలియన్ డాలర్ల GSDP సాధించే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయి అంచనాల ప్రకారం ఈ లక్ష్యం 15 ఏళ్లలో సాధ్యమవుతుందని భావిస్తున్నాం. కానీ, ఈ ప్రయాణాన్ని వేగవంతం చేసి పదేళ్లలోపే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ ఉంది.
2047 నాటికి జాతీయ జీడీపీకి తెలంగాణ 8 శాతం, అంటే 2.4 ట్రిలియన్ల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేసి తెలంగాణ జాతీయ లక్ష్యాలకు చోదకంగా నిలబడుతుంది. దేశంలో ఇప్పటికే పారిశ్రామిక, సాంకేతిక, పరిపాలనా సంస్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా ఉండటం గర్వంగా ఉంది.
ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.9 శాతంగా మాత్రమే ఉంది. ఆర్థిక సహకారం అందించడంలో తెలంగాణ వాటాను గణనీయంగా పెంచాలని కోరుకుంటున్నాం. భారత యూనియన్‌లో అత్యంత డైనమిక్, సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదగాలని మేం లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. స్థిరమైన, సమ్మిళితమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో పరస్పరం సహకరించుకోవాలి.
దేశంలోని 6 మహా నగరాలైన ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ల పట్టణ జీడీపీలో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ లాంటి నగరాలతో పోల్చితే పరిమాణంలో చిన్నదైనప్పటికీ హైదరాబాద్ ఇప్పటికే GDPలో సుమారు 2.5 శాతం సమకూర్చుతోంది.
ఆర్థిక, ప్రతిభ, పెట్టుబడి, సాంకేతిక పురోగతి కేంద్రాలుగా ఉన్న ఈ మహా నగరాల పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో గౌరవ ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల నాయకత్వంలో జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ఈ టాస్క్‌ఫోర్స్ ఆయా నగరాల్లో ప్రత్యేక సమగ్ర పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు, పాలన సంస్కరణలపై ప్రత్యేకమైన వ్యూహం ఉండాలి. జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఊపును తీసుకురావడంతో పాటు లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో, ప్రపంచ పట్టణ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
తెలంగాణ రైజింగ్ 2047 లో మహిళా సాధికారత కీలకం. మహిళల సంఘాలకు పెట్టుబడులు సమకూర్చడం వలన వారి కుటుంబాలు, సంఘాలు, ఆర్థిక వ్యవస్థలో మంచి ఫలితాలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తోంది. మహిళా స్వావలంబన, పెట్టుబడులు, చలనశీలత, ఆర్థికాభివృద్ధిని దన్నుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఇందిరా మహిళా శక్తి మిషన్'ను ప్రారంభించింది.
యువత సాధికారితపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యువతను సమర్థమైన, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, పోలీస్ పాఠశాల, ఏటీసీలు, పరిశ్రమలతో అనుసంధానమైన నైపుణ్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్ సర్వీసెస్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించాం. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక్క ఏడాదిలోనే 60 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కీలక మైలురాయిని చేరుకుంది.
వాతావరణ మార్పులతో గత పదేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విధాన ఎజెండాలో ముందు వరుసలో ఉంచింది. రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న ధాన్యానికి కింటాకు రూ. 500 ప్రోత్సాహకం, 5 లక్షల మేరకు బీమా అందిస్తున్నాం. గిరిజన రైతుల వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు 'ఇందిరా సౌర గిరిజల వికాసం' పథకాన్ని ప్రారంభించాం.
సుదీర్ఘకాలంగా ఉన్న అసమానతనలు తొలగించాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే చేపట్టిందని, ఇది తెలంగాణ సాధించిన మరో ఘనతను మీతో పంచుకోవడం నాకు గర్వంగా ఉంది. ఈ సర్వే తెలంగాణకు ఎక్స్-రే వంటిది. ఈ చారిత్రాత్మక చర్యకు గుర్తింపుగా, 2024, ఫిబ్రవరి 4న 'సామాజిక న్యాయ దినం'గా ప్రకటించాం. ఇందుకు సంబంధించి రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వానికి పంపాం.
ఇది తెలంగాణలో సామాజిక న్యాయం, సమ్రగత సాధనలో కీలక ఘట్టం. కచ్చితమైన, భారీ డేటా సేకరణ, సమ్మిళిత విధాన రూపకల్పన, సామాజిక న్యాయానికి పునాదిగా ఎలా ఉపయోగపడుతుందో చూపడం ద్వారా తెలంగాణ దేశానికి నమూనాగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలనే నిర్ణయానికి మా శాసనసభ తీర్మానం ప్రేరణనివ్వడం మాకు గర్వకారణం.
ఎస్సీ ఉప వర్గీకరణను సమర్థిస్తూ గౌరవ సుప్రీంకోర్టు 2024, ఆగస్టు 1న చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎస్సీ ఉప వర్గీకరణపై పరిశీలన చేసి సిఫార్సులు చేయాలని జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరాం. సమగ్ర విశ్లేషణ అనంతరం కమిషన్ ఎస్సీల్లోని 59 కులాలను మూడు వర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసింది.
మారుతున్న కాలానుగుణంగా ఆర్థిక ప్రగతి పథం వైపు నడిపించడానికి తెలంగాణ పారిశ్రామిక రంగం పురోగతికి ప్రగతిశీల విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, కేంద్రీకృత నైపుణాభివృద్ధి వంటి అంశాలతో వ్యూహాత్మక పారిశ్రామికీకరణ ఎజెండాను తెలంగాణ అనుసరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం తమదైన ఆర్థిక వ్యవస్థలతో పూర్తి పట్టణ (కోర్ అర్బన్)-పాక్షిక పట్టణ (సెమీ అర్బన్), గ్రామీణ ప్రాంతాలుగా విభజించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీని లేదా భారత్ ఫ్యూచర్ సిటీని భారతదేశపు మొట్టమొదటి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. భిన్న రంగాలు, స్థిరమైన పట్టణ-పారిశ్రామిక కేంద్రంగా 30 వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ నగరం నిర్మితమవుతోంది. 15 లక్షల మందికి నివాసం, 7.5 లక్షల మందికి ఉపాధిని కల్పించేలా రూపొందుతోంది.
భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీ, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ జోన్, EV , ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ESS) జోన్, రెసిడెన్షియల్, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్స్, స్పోర్ట్స్ సిటీ, యూనివర్సిటీ, ఎడ్యుకేషనల్ హబ్, డేటా హబ్ వంటి ప్రత్యేక జోన్లు ఉంటాయి.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో, ముఖ్యంగా ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాల్లో సేవల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. 2024–25 (AE) ఆర్థిక సంవత్సరంలో, సేవల రంగం తెలంగాణ GSVA లో 66 శాతం వాటాను అందించింది.
మహిళా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ.. సమ్మిళిత సాంకేతికత సాధికారత లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోంది. అలాగే పర్యావరణ హిత మౌలిక వసతులు కల్పిస్తోంది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ- 2025 తీసుకొచ్చాం. విద్యుత్ వాహనాల వినియోగం పెంచాలన్న లక్ష్యంతో వాటిపై వంద శాతం రోడ్డు పన్ను మినహాయించాం. 2030 నాటికి రాష్ట్రంలో 6 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లు, 2035 నాటికి 12 వేల స్టేషన్లు ఏర్పాటు లక్ష్యంగా నిర్ధేశించాం.
రాష్ట్ర భవిష్యత్తును మార్చగల దార్శనిక పట్టణ ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, ప్రాంతీయ రింగ్ రోడ్ ఇందులో ఉన్నాయి. అనుసంధానతను (కనెక్టవిటీ) మెరుగుపర్చడం, రాకపోకలను (ప్రయాణాలు) ప్రోత్సహించడం, ఆర్థిక వృద్ధికి కొత్త జోన్‌లను తెరవడమే ఈ పనుల లక్ష్యం.
తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల వృద్ధికి గణనీయంగా దోహదపడే ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం నిర్మాణాత్మక మద్దతు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
దక్షిణ తెలంగాణలోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ఎస్. జైపాల్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జీవనాడి. ఈ పథకం 1,226 గ్రామాల తాగునీటి అవసరాలను, 12.36 లక్షల ఎకరాలకు సాగు నీటి వసతిని కల్పిస్తుంది. ఈ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు CWC ఇవ్వాలని, పథకానికి ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద ఆర్థిక సహాయం అందించాలి.
స్థిరమైన, సమ్మిళిత పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ఒక నమూనాగా అవతరించింది. గత రెండు సంవత్సరాల్లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ద్వారా 52 వేల పైచిలుకు ఉద్యోగాలను కల్పించే రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది” అని ముఖ్యమంత్రి వివరించారు.
దాదాపు వందకు పైగా అంశాలతో తెలంగాణ రైజింగ్ ఎజెండాను సమగ్రంగా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం, సమన్వయం ఉండాలని అభిలషించారు. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తెలంగాణ సంపూర్ణంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.