'తెలంగాణ కు ఈడీ, మోడీ కలిసే వచ్చారు'

ఎమ్మెల్సీ కవిత అరెస్టులో కేసీఆర్ పాత్ర కూడా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసును డైలీ సీరియల్ లా నడిపించారని ఎద్దేవా చేశారు.

Update: 2024-03-16 12:46 GMT



కవిత అరెస్టుపై ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆసక్తికరమయిన  వ్యాఖ్యలు చేశారు.


కవిత  అరెస్ట్ ఒక పథకం ప్రకారం జరిగిందని ఆయన చెప్పారు. అందుకే హైదరాబాద్ కు ఇడి,  మోడీ కలిసే వచ్చారని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్నసాయంకాలం కవితని ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ (ఇడి) అధికారులు అరెస్టు చేసినప్పటి నుంచి ప్రధాని మోడీ హైదరాబాద్ లో ఉన్నపుడు కవిత అరెస్టు జరగడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిని రేవంత్ వివరణ ఇచ్చారు. ఇడి అధికారలు రావడం,మరొక వైపు ప్రధాని మోడీ సిటికి రావడం వేర్వేరు సంఘటనలు కాదని చెప్పారు.


"తెలంగాణ కు ఈడీ, మోడీ కలిసే వచ్చారు. కవిత అరెస్టు ఒక సీరియల్ లాంటిది. అరెస్ట్ తో ఈ డ్రామా పతాక స్థాయి కి వచ్చింది. సానుభూతి కోసం బీజేపీ, బీఆర్ఎస్ పాకులాడుతున్నాయి," అని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టులో కేసీఆర్ పాత్ర కూడా ఉందని అంటూ ఆయన దానికి సాక్యం చూపించారు.

 "కవిత ను అరెస్ట్ చేస్తుంటే తండ్రి గా కేసీఆర్ ఎందుకు రాలేదు? బిడ్డ కోసం ఆయన ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు? పార్టీ ఎమ్మెల్సీ అయిన కవిత అరెస్ట్ ను కేసీఆర్ ఎందుకు ఖండించలేదు? తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ అరెస్ట్ గురించి మాట్లాడడం లేదు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ లు నాటకం ఆడుతున్నాయి. సర్వేలన్నీ కాంగ్రెస్ కి అనుకూలంగా రావడంతో డ్రామాకి తెర లేపారు" అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును కేసీఆర్ ఫ్యామిలీ, బీజేపీ కలిసి డైలీ సీరియల్ లా నడిపించారని అన్నారు. ప్రజాపాలనకి రేపటితో వంద రోజులు పూర్తి కానుండడంతో మంత్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


మా దగ్గర వ్యూహం ఉంది...


కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


"కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ పెద్దలు మన ప్రభుత్వమే రాబోతుందని వారి ఎమ్మెల్యే లకు చెప్తున్నారట. ఈ విషయాన్ని నన్ను కలసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాకు చెప్తున్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలకు మంత్రి పదవులు పంచేస్తున్నారట. మేము జాయినింగ్స్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే బీఆర్ఎస్ లో నలుగురు, అయిదుగురు కంటే మిగలరు. మమ్మల్ని మా పనిచేసుకోనిస్తే.. ప్రతిపక్షం పనిని ప్రతిపక్షాన్ని చేసుకోనిస్తాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరు. మా దగ్గర వ్యూహం ఉంది.. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. నల్లగొండ సభలో నన్ను విమర్శించిన విషయం మర్చిపోయారా. భాష గురించి కేసీఆర్ కు ఇప్పుడైనా గుర్తుకు రావడం మంచిదే. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు మా ప్రభుత్వానికి రెఫరెండం. మా పరిపాలనను చూసి ఓటేయాలని కోరుతున్నాం" అంటూ రేవంత్ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News