సియోల్‌లో అర్దరాత్రి చియోంగ్‌గీచియాన్ నదీ తీరంలో సీఎం షికారు, వీడియో
దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం అర్దరాత్రి సీయోల్ నగరంలోని చియోంగ్‌గీచియాన్ నదీతీరంలో షికారు చేశారు. షికారు ఎందుకంటే...
By : Saleem Shaik
Update: 2024-08-13 01:44 GMT
విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి మంగళవారం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. సీఎం రోజంతా పలు ప్రపంచస్థాయి కంపెనీల అధినేతలు, వ్యాపార బృందాలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరారు.
- లండన్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న థేన్స్ నది తరహాలో హైదరాబాద్ నగరంలోని మూసీనదిని అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం దక్షిణ కొరియా దేశంలోని చియోంగ్‌గీచియాన్ వాటర్ ఫ్రంట్ ను కూడా సందర్శించారు.
- సోమవారం అర్దరాత్రి సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి సియోల్ అధికారులు వెంటరాగా వాటర్ ఫ్రంట్ తీరంలో పర్యటించారు. చియోంగ్‌గీచియాన్ వాటర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసిన తీరును సీఎం పరిశీలించారు.
మూసీ పునర్జీవంపై మార్గాలు అన్వేషించాను : సీఎం రేవంత్ రెడ్డి
‘‘హైదరాబాద్ మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ప్రపంచ స్థాయి వాటర్ ఫ్రంట్‌ను ఎలా నిర్మించాలి? పరిష్కారాలను అన్వేషిస్తూ నేను, నా బృందం సియోల్‌లోని చియోంగ్‌గీచియాన్ వాటర్ ఫ్రంట్ తీరంలో అర్థరాత్రి షికారు చేశాం. సీయోల్ నగరంలోని ఈ నదిని చూశాక చాలా ఆలోచనలు వచ్చాయి.’’అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.
సీఎం షికారు వీడియో వైరల్
సీయోల్ నదీ తీరంలో సందర్శన వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో నెటిజన్లతో పంచుకున్నారు. సీయోల్ నదీ తీరంలో సీఎం షికారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియన్ కంపెనీల ఆసక్తి
వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సహా 25 భారీ జౌళి కంపెనీల ప్రతినిధులతో చర్చించారు.ఈ సమావేశంలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ,వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి ఉన్న సానుకూలతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పిలుపునకు కొరియన్ టెక్స్‌టైల్ కంపెనీల ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు.
తెలంగాణలో హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్
దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగాణలో కారు మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.
How should #Hyderabad look after we rejuvenate River Musi and build a world-class waterfront? Exploring solutions and brainstorming possibilities, my team and I went on a late-night stroll along Cheonggyecheon stream in Seoul. Found lots of ideas and insights : @revanth_anumula… pic.twitter.com/0mJRqNZXJr
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2024