'ఆదివాసీల పక్షాన నిలబడినందుకే ప్రొ. సాయిబాబాను హింసించారు'

-తిరుపతి లో జరిగిన సంస్మరణ సభలో పలువురు వక్తలు

Update: 2024-10-13 16:00 GMT


-రాఘవ

ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని, అణగారిన ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన నిలబడినందుకే బిజెపి ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను మరణించేలా చేసిందని పలువురు వక్తలు ఆరోపించారు. సాయిబాబాది సహజమైన మరణం కాదని, అది కేంద్రంలో ఉన్న ప్రభుత్వ చేసిన హత్యేనని వారు స్పష్టం చేశారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సాయంత్రం ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ఆ వేదిక కన్వీనర్ పి. అంజయ్య అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో పలువురు ప్రసంగించారు.

ఈ సంస్మరణ సభ ప్రారంభానికి ముందు సాయిబాబా మృతికి కొద్ది నిమిషాలు మౌనం పాటించి, ఆయనకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పి. అంజయ్య మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ప్రజలకోసం పనిచేసే వారిని చంపేస్తోందని, లేదా చనిపోయేలా చేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య వాదులు దీన్ని ఖండించాలని కోరారు. సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, సాయిబాబా మరో మూడు నెలలు జైల్లో ఉంటే చనిపోతారని భావించి ముందే విడుదల చేశారని అన్నారు. సాయిబాబా తన అవిటితనాన్ని మరిచిపోయి, సమాజ అవిటితనాన్ని పోగొట్టాలనుకున్నారని, ప్రశ్నించేవారికి సాయిబాబా ఇన్స్పిరేషన్ అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ, పదేళ్ళ క్రితం కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించేవారిని చంపడానికి ప్రైవేటు సైన్యాన్ని తయార చేసి గౌరి లంకేష్, కల్బుర్గి, పన్సారె వంటి వారిని హత్యచేయించిందని, ఈ హత్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడంతో జైల్లో పెట్టి స్టాన్ స్వామి లాంటి వారిని చనిపోయేలా చేస్తోందని, పదేళ్ళు అండాసెల్లో నిర్బంధించి సాయిబాబాను చనిపోయే ముందు విడుదల చేసిందని ఆరోపించారు. ఇవ్వన్నీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. సాహితీ వేత్త సాకం నాగరాజు మాట్లాడుతూ, కామ్రెడ్ అన్న మాటకు నూటికి నూరు పాళ్ళు సరైన వ్యక్తి సాయిబాబా అంటూ, మన కాలపు పోరాట యోధుడని కొనియాడారు.



డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ, సాయిబాబా గురించి మాట్లాడాలంటే ధైర్యం చాలడం లేదని, ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసినప్పుడు మనం చేయాల్సినంత చైతన్యంతో అండా సెల్ ను బద్దలు కొట్టేలా ఉద్యమం చేపట్టినట్టయితే ఈ స్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ మాట్లాడుతూ, ఈ బీజేపీ ప్రభుత్వం సాయిబాబాను అత్యంత కిరాతకంగా బంధించి చంపిందని, ఈ ప్రభుత్వం ఎంత త్వరగా దిగిపోతుందా అని ఎదురు చూసే వాళ్ళలో తానూ ఒకడినని అన్నారు.


పౌరచైతన్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వరరావు మాట్లాడుతూ, రాజ్య హింసను ఎదుర్కోడానికి ఒక గొంతుక చాలదు, వేలాది గొంతుకలు కావాలన్నారు. ‘చక్రాల కుర్చీ నుంచి చరిత్ర పుటలకెక్కిన సాయిబాబా’ అంటూ కవితను చదివారు. సీపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ, సాయిబాబా మృతి బీజేపీ హత్యని పేర్కొంటూ, తమ కార్యాలయంలో సాయిబాబా మృతికి ఈ రోజు ఉదయమే శ్రద్ధాంజలి ఘటించామని గుర్తు చేశారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, రాజీలేని పోరాటమే సాయిబాబాకు నిజమైన నివాళి అన్నారు. భూమన్ మాట్లాడుతూ, సాయిబాబా ఏం చేశారో తెలియని వారికి కూడా ఆయన గొప్ప ఇన్స్పిరేషన్ అన్నారు. రచయిత ఓ.రమణ మాట్లాడుతూ ఉపా చట్టం చాలా కుట్రపూరితమైనదని, దీన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. క్రాంతి మాట్లాడుతూ, సాయిబాబా శరీరం సహకరించకపోయినా, ఆయన మెదడు వేలాది మందిని ప్రభావితం చేయగలదని న్యాయమూర్తి అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాఉద్యమాలకు మద్దతు తెలిపే వారందరిపైనా కేసులు పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.

సిపిఐ నాయకుడు పెంచలయ్య మాట్లాడుతూ సాయిబాబా అనారోగ్యంతో చనిపోలేదని, బీజేపీ ప్రభుత్వమే హత్యచేసిందని అన్నారు. రాజ్యహింస పెరిగిపోతోందని, ఛత్తీస్ గడ్ అడవుల్లో 36 మందిని కాల్చి చంపేసిందని గుర్తు చేశారు. పౌరచైతన్య వేదిక కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ మాట్లాడుతూ ప్రజలహక్కుల కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాను ప్రభుత్వమే చంపేసిందనడంలో సందేహం లేదన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి విశ్వనాథ్ మాట్లాడుతూ గౌరీలంకేష్, కల్బుర్గి, పన్సారేలను హత్య చేసినప్పుడు మనం చైతన్యమైతే సాయిబాబా మృతి వంటి సంఘటనలు జరిగేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్మ మాట్లాడుతూ సాయిబాబాది సహజమరణం కాదని, రాజ్యమే హత్య చేసిందని అన్నారు. చివరగా సాయిబాబా చిత్రపటం ముందు నిలుచుని అంతా జోహార్లు అర్పించారు.


Tags:    

Similar News