కంటోన్మెంట్ లో ముగ్గురూ ఇబ్బందులు పడుతున్నారా ?

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ మూడు ప్రధాన పార్టీల మధ్య ఎలాగైతే గట్టిగా జరుగుతోందో కంటోన్మెంట్ ఉపఎన్నిక కూడా అలాగే జరుగుతోంది. ముగ్గురూ బాగా ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-04-22 09:17 GMT
Cantonment candidates ganesh, tilak and niveditha

పార్లమెంటు ఎన్నికలతో పాటు జరుగుతున్న ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక. ఈ ఉపఎన్నికల్లో గెలుపుకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు హోరాహోరీగా పోరాటంచేస్తున్నారు. నిజానికి ఈ ఉపఎన్నిక ఎంఎల్ఏ మరణంతో జరుగుతోంది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన లాస్యా నందిత గెలిచింది. అయితే కొద్దిరోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. దాంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకనే ఉపఎన్నికను ప్రత్యేకంగా నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల కమీషన్ పార్లమెంటు ఎన్నికలతో కలిపి నిర్వహిస్తోంది. అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికల మీదుంది కాబట్టి కంటోన్మెంట్ ఉపఎన్నికను ఎవరు పెద్దగా పట్టించుకోవటంలేదు.

పార్లమెంటు ఎన్నికల్లో పోటీ మూడు ప్రధాన పార్టీల మధ్య ఎలాగైతే గట్టిగా జరుగుతోందో కంటోన్మెంట్ ఉపఎన్నిక కూడా అలాగే జరుగుతోంది. గట్టిగా చెప్పాలంటే ముగ్గురు అభ్యర్ధులు గెలుపుకు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సెంటిమెంటు రాజకీయాలు పనిచేయటంలేదు. మామూలుగా అయితే ఎంఎల్ఏ చనిపోయినపుడు ఉపఎన్నిక జరిగితే మిగిలిన పార్టీలు పోటీపెట్టవు. చనిపోయిన ఎంఎల్ఏ స్ధానంలో కుటుంబసభ్యుల్లో ఎవరినో పోటీలోకి దింపుతారు. ప్రత్యర్ధిపార్టీలు పోటీచేయవు కాబట్టి ఎంఎల్ఏ అభ్యర్ధి నామినేషన్ వేయటం, గెలిచినట్లు ప్రకటించటం అంతా లాంఛనమే. అయితే ఇపుడు సీన్ రివర్సులో నడుస్తోంది. నందిత చనిపోయిన కారణంగా జరుగుతున్న ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఆమె చెల్లెలు నివేదితకు టికెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్, బీజేపీలు సెంటిమెంటును పక్కకుతోసేసి తాము పోటీలో ఉంటామని ప్రకటించాయి.

ఎప్పుడైతే ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలు పోటీలోకి దిగాయో అప్పటినుండి నివేదితకు కష్టాలు మొదలయ్యాయి. ఈరోజు పరిస్ధితి ఏమిటంటే గెలుపుకు కారుపార్టీ అభ్యర్ధి నానా అవస్తలు పడుతున్నారు. అక్క తాలూకు మరణం సెంటిమెంటు జనాల్లో పెద్దగా కనబడటంలేదని సమాచారం. పైగా కొందరు కీలకనేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఫలితంగా ఇపుడు నివేదిత గెలుపుకు ఎదురీదుతున్నారు. సీనియర్ నేత ముప్పిడి మధుకర్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరారు. అలాగే నివేదితతో పాటు టికెట్ కోసం ప్రయత్నించిన మన్నె క్రిషాంక్, గజ్జల నగేష్, డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అభ్యర్ధి గెలుపుకు పెద్దగా సహకరించటంలేదని పార్టీలోనే చెప్పుకుంటున్నారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్ధి సమస్య మరోరకంగా ఉంది. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికలో కంటోన్మెంట్ నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి రెండోస్ధానంలో నిలిచిన శ్రీ గణేష్ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఉపఎన్నికలో ఇపుడు గణేషే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. బీజేపీ నుండి వచ్చిన గణేష్ కు తాము సహకరించేదిలేదని కొందరు నేతలు గట్టిగా చెప్పారట. ఇదే సమయంలో గణేష్ వైఖరిపైన మల్కాజ్ గిరి పార్లమెంటు అభ్యర్ధి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారట. దాంతో సునీత తరపున కొందరు సీనియర్ నేతలు రంగంలోకి దిగి గణేష్ కు సహకరించని నేతలతో మాట్లాడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇక్కడ గణేష్ గెలిస్తే ఎంపీ అభ్యర్ధి వల్లే గెలవాలి.

ఇక బీజేపీ అభ్యర్ధి వంశీ తిలక్కు స్ధానిక నేతలు పెద్దగా సహకరించటంలేదట. మామూలుగానే పార్టీకి ఉన్న పట్టు అంతంతమాత్రమే. దానికితోడు తిలక్ పైన లోకల్లో వ్యతిరేకత ఉందని పార్టీ రిపోర్టులు చెబుతున్నాయి. టికెట్ కోసం ప్రయత్నించిన వారికి కాకుండా సడెన్ గా కొత్త అభ్యర్ధి తిలక్ ను అధిష్టానం పోటీలోకి దింపటంతో సీనియర్లలో చాలామంది ప్రచారంలో కనబడటంలేదని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మూడు పార్టీల్లోని అభ్యర్ధులు సమస్యలతో అవస్తలు పడుతున్నారు. చూస్తుంటే సెంటిమెంటు ఎక్కడా పనిచేయటంలేదనే అనిపిస్తోంది. కాంగ్రెస్ గెలిస్తే ఊపులో గెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తే అక్క మరణం తాలూకు సెంటిమెంటు అండర్ కరెంటుగా ఉన్నట్లుగా భావించాల్సుంటుంది. బీజేపీ అభ్యర్ధిని నరేంద్రమోడి ఇమేజి, అయోధ్యలో రామాలయం నిర్మాణమే గెలిపించాలి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News