KTR | ‘రాహుల్ చూపిన మార్గమే’.. అసెంబ్లీ గొడవపై కేటీఆర్..
తెలంగాణ అసెంబ్లీ దగ్గర సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి అనుమతించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంది.;
తెలంగాణ అసెంబ్లీ దగ్గర సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి అనుమతించకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంది. అందుకు వారు ధరించిన టీషర్ట్‌లే కారణం అని తెలిపింది. ‘అదానీ, రేవంత్ భాయ్ భాయ్’ అని రాసున్న టీషర్ట్‌ను వేసుకుని అసెంబ్లీకి రావడంతోనే వారిని అడ్డుకుంటున్నామని పోలీసులు వారిని అడ్డగించారు. దాంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య చిన్నపాట వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తమను ఎందుకు ఆపారని కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏం తప్పు చేశామని అసెంబ్లీకి అనుమతించరని, నచ్చిన టీషర్ట్ వేసుకుని కూడా అసెంబ్లీలోకి రాకూడదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఒకలా.. ఇక్కడ తెలంగాణ గల్లీల్లో ఒకలా ప్రవర్తిస్తుందని, తాము అసెంబ్లీలోకి వస్తే ఆ ద్వంద వైఖరి గుట్టు రట్టు అవుతుందనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. తానేమీ ఈ టీషర్ట్‌లో కొత్త పరంపర తీసుకురావట్లేదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని చూసే తాను ఇది నేర్చుకున్నానంటూ కేటీఆర్ చురకలంటించారు. రాహుల్‌కి పార్లమెంటులో తెలపని అభ్యంతరం తనకు అసెంబ్లీలోకి వెళ్లడానికి ఎందుకు తెలుపుతున్నారని మండిపడ్డారు కేటీఆర్.
‘రాహుల్‌కో న్యాయం.. నాకో న్యాయమా’
‘‘అదానీ, మోదీ ఫోటో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్ గాంధీ వస్తే పార్లమెంటులోకి అనుమతించారు. ఆయన అలా రావడం సరైనదే అయితే.. నేను ఇలా రావడం ఎందుకు తప్పు. ఆయన అడుగు జాడల్లోనే నడిచి అదానీ, రేవంత్ వ్యవహారాన్ని అసెంబ్లీలో బయటపెట్టడానికి మాకెందుకు అనుమతి లేదు. ఢిల్లీలో ఏమో రాహుల్ గాంధీ.. అదానీపై తీవ్ర విమర్శలు చేస్తారు. ఇక్కడ గల్లీలో ఏమో గుంపు మేస్త్రీ రేవంత్.. అదానీతో దోస్తీ చేస్తాడు. ఇదే కాంగ్రెస్ ద్వంద వైఖరి. ఇటువంటి బయటకు వస్తాయన్న భయంతోనే కాంగ్రెస్.. మమ్మల్ని లోపలికి రాకుండా అడ్డగించింది’’ అని విమర్శలు చేశారు.
డ్రెస్ కోడ్ గురించి స్పీకర్ చెప్తారా..?
‘‘రేవంత్ రెడ్డి, అదానీ ఫొటో ఉన్న టీషర్ట్ వేసుకుని అసెంబ్లీలోకి వెళ్తే తప్పేంటి. అసెంబ్లీకి ఎలాంటి దుస్తులు వేసుకుని రావాలో స్పీకర్ చెప్తారా. అదానీ, మోదీ ఫొటో ఉన్న షర్ట్ వేసుకుని రాహుల్ పార్లమెంటుకు వెళ్తే ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. అలాంటిది మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించట్లేదు. రాహుల్, ప్రియాంకలతో సహా దాదాపు 100 మంది ఎంపీలు అదానీ, మోదీ ఫొటోలు ఉన్న టీషర్ట్‌లు ధరించి పార్లమెంటులోకి వెళ్లారు. వాళ్లకి అనుమతి ఉంటుంది కానీ.. మాకు మాత్రం అసెంబ్లీలోకి ఎంట్రీ ఉండదా. పార్లమెంటులో ఒక నీతి.. అసెంబ్లీలో ఒక న్యాయమా. అదెలా సాధ్యమవుతుంది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్ల ప్రజల తరపున నిరసన తెలపడానికి అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారు’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో డబ్బు సంచులు పంపిస్తున్న కారణంగానే అదానీతో గుంపు మేస్త్రీ వ్యాపార లావాదేవీలపై కాంగ్రెస్ మౌనం వహించిందని కేటీఆర్ ఆరోపించారు.
చీకటి ఒప్పందలు బయటపడతాయని భయమా: కవిత
బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి రాకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటుగా స్పందించారు. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు బహిర్గతం అవుతాయన్న భయంతోనే రేవంత్ రెడ్డి.. తమ పార్టీ నాయకులను సభలోకి కూడా రాకుండా అడ్డుకుంటున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘శాసనసభలోకి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పోలీసులు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అదానీ, మోడీ భాయ్ భాయ్ అనే స్లోగన్స్ తో టీషర్ట్స్ వేసుకుని వెళ్లారు, అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తెలంగాణలో మాత్రం అదే అదానీ-రేవంత్ చీకటి ఒప్పందాలను ప్రశ్నిస్తే అరెస్టులా? చీకటి ఒప్పందాలు బయటపడతాయనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభలోకి రాకుండా ఆపుతున్నవా రేవంత్ రెడ్డి?’’ అని విమర్శించారు.