కేసీఆర్ కు అవమానం..మండిపోతున్న బీఆర్ఎస్
రగడ ఎంతవరకు చేరుకున్నదంటే చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఘోరంగా అవమానించేంత స్ధాయికి చేరుకున్నది.
ప్రోటోకాల్ వివాదం తారస్ధాయికి చేరుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ పాటించలేదన్న కారణంతో ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. అందుకనే ప్రోటోకాల్ రగడ రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ రగడ ఎంతవరకు చేరుకున్నదంటే చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఘోరంగా అవమానించేంత స్ధాయికి చేరుకున్నది. కేసీఆర్ కు జరిగిన అవమానంలో అధికారుల బాధ్యత ఎంతుందో ప్రభుత్వంలోని ఉన్నతస్ధాయిలోని వ్యక్తులదీ అంతే ఉంది.
ఇంతకీ ఏమి జరిగిందంటే ఆగష్టు 15వ తేదీన అన్నీ నియోజకవర్గాల్లో జాతీయజెండాను ఎగురవేశారు. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు తర్వాత ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, ఎంపీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జెండా వందనం జరిగింది. దానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహాదారు కేకే కేశవరావు, విశిష్ట అతిధులుగా మంత్రులు కొండా సురేఖ, సిలారపు దామోదర రాజనరసింహ పేరును ఆహ్వానపత్రికలో ముద్రించారు. తర్వాత గౌరవ అతిధులుగా ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, ఎంపీలు, మున్సిపల్ ఛైర్మన్ పేర్లను ముద్రించారు. 16 మంది పేర్లున్న ఆహ్వానపత్రికలో గజ్వేలు ఎంఎల్ఏగా కేసీఆర్ పేరు వరుససంఖ్యలో 12 వది.
ఏ హోదాలో ప్రభుత్వ సలహాదారు కేకే పేరును ముఖ్య అతిధిగా ముందు ప్రకటించారో, గజ్వేలు ఎంఎల్ఏ కేసీఆర్ పేరు మొత్తం మీద 12వ పేరుగా ముద్రించారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ ఉత్త ఎంఎల్ఏ మాత్రమే కాదు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాతో క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. ప్రభుత్వానికి సంబందించిన ఏ కార్యక్రమంలో అయినా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత పేరు కేసీఆర్ పేరే ఉండాలి. కేసీఆర్ తర్వాతే మంత్రులుంటారు. కాని ఇక్కడ ప్రభుత్వ సలహాదారు కేకే పేరు ముఖ్యఅతిధిగా ముద్రించి తర్వాత మంత్రుల పేర్లుంచి ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎల్సీల వరుసలో కేసీఆర్ తొమ్మిదో పేరుగా ముద్రించారు.
ఎప్పుడైతే ఆహ్వానపత్రిక సర్క్యులేషన్లోకి వచ్చిందో వెంటనే బీఆర్ఎస్ నేతలతో పాటు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద దాడిచేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేశారు. ప్రోటోకాల్ వివాదం ముగిసిందని అనుకుంటున్నంత సేపు పట్టలేదు కేసీఆర్ కు అవమానం జరగటానికి. ఎప్పుడైతే వ్యతిరేకంగా గోల మొదలైందో వెంటనే మేల్కొన్న ప్రభుత్వం మరో ఆహ్వానపత్రికను ముద్రించింది. అందులో కూడా ముఖ్య అతిధిగా కేకే పేరుంచిన ప్రభుత్వం విశిష్ట అతిధుల వరసలో ముందు కేసీఆర్ పేరుంచి తర్వాత మంత్రులు కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహా పేర్లను ప్రింట్ చేసింది. అంటే రెండోసారి ముద్రించిన ఆహ్వానపత్రికలో కేసీఆర్ పేరు రెండోస్ధానంలో కనబడింది.
అసలు కేసీఆర్ తో పోల్చుకుంటే కేకే స్ధాయి ఏమిటో ఆయనకు అంత ప్రాముఖ్యత ఎందుకిస్తున్నారో జనాలకు అర్ధంకావటంలేదు. ఆహ్వానపత్రికలో కేసీఆర్ పేరు ఎక్కడున్నా ఆయన వస్తారా అన్న సందేహాలు అవసరంలేదు. ప్రభుత్వ కార్యక్రమానికి కేసీఆర్ ఎలాగూ రారని అందరికీ తెలిసిందే. రావటం, రాకపోవటం కేసీఆర్ ఇష్టం. అయితే ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు మరచిపోకూడదు. ఏదేమైనా ఆగష్టు 15 జెండా వందనం రోజున కేసీఆర్ కు తీరని అవమానం జరిగిందన్నది మాత్రం వాస్తవం. కొసమెరుపు ఏమిటంటే పంద్రాగష్టు కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదు.