మంత్రి ముందే కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుందని, కాంగ్రెస్ బలం, బలహీనత రెండూ కూడా పార్టీలో ఉన్న స్వేచ్ఛే అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.;

Update: 2025-05-04 09:54 GMT

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మరోసారి బహిర్గతమయ్యాయి. మంత్రిముందే నాయకులు తన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు భగ్గుమంటాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ముందే హస్తం పార్టీ నేతలు కొట్టుకున్నారు. ఒకరిపైకి మరొకరు ఎగబడి మరీ తన్నుకున్నారు. ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ చెప్పారు. వెంటనే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలుగజేసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగడం వంటిది ఏమీ ఉండదన్నారు. ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తామని చెప్పారు. కాగా అసలు ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఆయన బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్తా కొట్లాటగా మారింది. వెంటనే కలుగజేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను వేరు చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.

కాంగ్రెస్ బలం, బలహీనత కూడా స్వేచ్ఛే

ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలం, బలహీనత రెండూ కూడా పార్టీలో ఉన్న స్వేచ్ఛే అని అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. మన పార్టీ బలమే స్వేచ్ఛ..బలహీనత కూడా స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీలో గొడవలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఈ గోడవలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మాకు ఉంది. కాంగ్రెస్ పార్టీలో గొడవలు, వర్గాలు కామన్. నారాయణఖేడ్ లో గొడవ ఉన్న చోట సురేష్ ఎంపీ, సంజీవ రెడ్డి ఎమ్మెల్యే కాలేదా. అలాగే మిగతా చోట్ల కూడా గొడవ సద్దుమణిగేలా చూస్తాం. రాజకీయాల్లో బేధాలు సహజం...కానీ అవి పార్టీకి నష్టం జరిగేలా ఉండొద్దు. పార్టీలో వర్గాలు, అసంతృప్తి అనేవి సహజం..కానీ సమన్వయం అనేది చాలా ముఖ్యం. మేమందరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యులం.. ఆయన్ని రోజు తలచుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచింది’’ అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News