‘కాంగ్రెస్‌లో ఏముందోయ్’.. పార్టీపై జీవన్ రెడ్డి అసంతృప్తి తగ్గలేదా..!

కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి అసంతృప్తి తగ్గలేదా? గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచే పార్టీ వీడాలని అనుకుంటున్నారా?;

Update: 2025-04-01 10:53 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడాలని కూడా ప్లాన్ చేస్తున్నారేని కొన్ని రోజులుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనడం లేదన్న టాక్ కూడా కొనసాగుతుంది. కాగా తాజాగా కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలను వాస్తవం చేస్తున్నాయి. తాజాగా బీఎస్పీ నేత విజయ్‌.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల సందర్భంగా ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు అడ్లూరి లక్ష్మణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగానే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌లో ఏముందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విని విజయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అవాక్కయ్యారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని అంతా నొరెళ్లబెట్టారు.

ఇంతకీ జీవన్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామని అనుకుంటున్నా. ఈ పార్టీలో ఏదో ఉందని అనుకుని నువ్వు పార్టీలోకి వచ్చావ్’’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. అతి త్వరలోనే జీవన్ రెడ్డి.. కాంగ్రెస్‌కు స్వస్తి పలకనున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆయన ఏ పార్టీలో చేరతారనేది కీలకంగా మారింది. విజయ్‌ చేరిక సందర్భంగా అన్నట్లు బీఎస్పీ కండువా కప్పుకుంటారా? లేదంటే బీజేపీ, బీఆర్ఎస్‌వైపు చూస్తారా అని చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే గతేడాది తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి పార్టీ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన నిరసనకు కూడా దిగారు. ఆయనను ఓదార్చడానికి, పరామర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పార్టీలో ఇక ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ.. వాళ్లు చెప్పిన దాన్నే మరిచింది. మన మహానీయుల విగ్రహాలను ఎందుకు పెడతాం. వారి ఆలోచనా విధాన్ని అలవర్చుకోవాలన్న ఉద్దేశంతో.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ అంటోందే తప్ప వారి విధి విధానాలు ఏమాత్రం ఆచరించడం లేదు. గతంలో కేసీఆర్ ఎలా నడుచుకున్నారో.. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే మార్గంలో వెళ్తోంది. మన నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. ఎవరికీ భరోసా ఇచ్చే స్థితిలో నేను లేను. నా ఆవేదనను మాత్రమే వ్యక్తం చేస్తున్నా’’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ సమయంలో ఆయన పార్టీ గుడ్‌బై చెప్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన తన రాజీనామా ప్రకటించలేదు. అంతేకాకుండా ఆ తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మరోసారి జీవన్ రెడ్డి పేరునే ప్రతిపాదించడం, ఆ విషయంలో పార్టీ ఎలా అంటే అలానే నడుచుకుంటానని జీవన్ రెడ్డి చెప్పడంతో అంతా సర్దుకుందేమో అన్న భావన కలిగింది. కానీ ఇప్పుడు తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీపై ఆయనకు ఇంకా కోపం తగ్గలేదన్న అంశాన్ని స్పష్టం చేస్తోంది. మరి ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News