ఫోర్త్ సిటీ పరిధిలోకి 56 గ్రామాలు.. లిస్ట్ ఇదే..
ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని తెలంగాణ అర్భన్‌గా, మిగిలిన ప్రాంతాలను రూరల్ తెలంగాణగా విభజించే యోచనలో ప్రభుత్వం ఉంది.;
ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎలాగైనా ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని నెవ్వర్ బిఫోర్ అనేలా నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎఫ్‌డీసీఏకు ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి, వైస్ ఛైర్మన్‌గా మున్సిపల్ శాఖ లేదా పరిశ్రమల శాఖ మంత్రి, సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ, పరిశ్రమలు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలక శాఖ, పర్యావరణశాఖ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులు, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైదరాబాద్ డీటీసీపీ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదే విధంగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రంగారెడ్డి జిల్లా 7మండలాల్లోని 56 గ్రామాలను తీసుకురావాలని నిశ్చయించింది. ఫ్యూచర్ సిటీని ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్యలోని 30వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. ఆ మధ్యలోనే ఉన్న 56 గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకురానుంది. వీటిలో 36 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉండేవి. వాటిని ఇప్పుడు ఎఫ్‌డీసీఏ పరిధిలోకి తీసుకురానుంది. దీంతో ఫ్యూచర్ సిటీ విస్తీర్ణం రంగారెడ్డి జిల్లాలోని అమన్‌గల్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, యాచారం, కందుకూరు, కడ్తాల్, మంచాల, మండలాల్లో 765.28 చదరపు కిలోమీటర్లకుపైగా ఉంటుంది. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతాన్ని తెలంగాణ అర్భన్‌గా, మిగిలిన ప్రాంతాలను రూరల్ తెలంగాణగా విభజించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే గ్రామాలివే..
మహేశ్వరం మండలం.. మొహబ్బత్నగర్, తుమ్మలూరు
మంచాల మండలం... ఆగపల్లి, నోముల, మల్లికార్జునగూడ
కడ్తల్ మండలం: చెరికొండ పట్టి కల్వకుర్తి, చెర్లికొండ పట్టి పడ్కల్, ఏక్‌రాజ్‌గూడ, కడ్తాల్, కర్కాల్ పహాడ్, ముద్విన్
యాచారం మండలం... చౌదర్పల్లి, గుల్గల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లె, మల్కాజిగూడ, మొగుళ్లవంపు, నక్కర్త, నానక్నగర్, నంది వనపర్తి, నజ్లిక్ సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తులేఖుర్దు, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి
కందుకూరు మండలం... దాసర్లపల్లి, అన్నోజిగూడ, దెబ్బడగూడ, గూడూరు, గుమ్మడవల్లె, కందుకూరు, కొత్తూరు, గఫూర్నగర్, లేమూర్, మాదాపూర్, మీరాఖాన్పేట్, మహ్మద్నగర్, ముచ్చెర్ల, పంజాగూడ, రాచూర్, సర్వరావులపల్లె, తిమ్మాయిపల్లె, తిమ్మాపూర్
ఇబ్రహీంపట్నం: కప్పపహాడ్, పోచారం, రాంరెడ్డిగూడ, తుర్కగూడ, ఎలిమినేడు, తడ్లకాల్వ, ఎర్రకుంట, తులేకలాన్
దీంతో పాటుగా హెచ్ఎండీఏ పరిధిని విస్తరిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి కొత్తగా నాలుగు జిల్లాల్లోని 16 మండలాలను చేర్చింది. మహబూబునగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో మొత్తం 1,355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా హెచ్ఎండీఏ పరిధి కొత్త 3వేల చదరపుకిలోమీటర్ల భూభాగం పెరిగింది. ప్రస్తుతం 7,257 చదరపుకిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ విస్తీర్ణం ఇప్పుడు 10,474.723 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. ఇందులో మహబూబ్ నగర్‌లో 19 గ్రామాలు, మేడ్చల్-మల్కాజ్‌గిరి నుంచి 163 గ్రామాలు, నల్లగొండ నుంచి 31 గ్రామాలు, రంగారెడ్డి నుంచి 533 గ్రామాలు, సిద్దిపేట నుంచి 74 గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 162 గ్రామాలు, మెదక్ నుంచి 101 గ్రామాలు, నాగర్‌కర్నూల్ నుంచి 3 గ్రామాలు, సంగారెడ్డి నుంచి 151 గ్రామాలు, వికారాబాద్ నుంచి 54 గ్రామాలు ఉన్నాయి.