పోలీసులు పాటించాల్సిన ‘ఎఫ్ 3’ గురించి చెప్పిన డీజీపీ

సినిమాలో నటుడు సాయికుమార్ పోలీసులు పెట్టుకునే టోపీమీద ఉండే మూడు సింహాల గురించి వివరిస్తు నాలుగో సింహమేరా పోలీసు అంటే గట్టిగా అరచి అరచి డైలాగులు చెబుతాడు

Update: 2025-10-10 06:41 GMT
Telangana DGP B. Sivadhar Reddy

కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ బీ. శివధరరెడ్డి పోలీసులు పాటించాల్సిన ఎఫ్ 3 గురించి వివరించారు. అదేదో సినిమాలో నటుడు సాయికుమార్ పోలీసులు పెట్టుకునే టోపీమీద ఉండే మూడు సింహాల గురించి వివరిస్తు నాలుగో సింహమేరా పోలీసు అంటే గట్టిగా అరచి అరచి డైలాగులు చెబుతాడు. ఇపుడు కొత్త డీజీపీ(Telangana DGP) చెప్పింది కూడా అచ్చంగా సినిమాలో సాయికుమార్ డైలాగులనే గుర్తుకుతెస్తోంది. ఇంతకీ డీజీపీ చెప్పిన ఎఫ్ 3 అంటే ఏమిటంటే ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ అట. ఈ మూడు ఎఫ్ లతో పాటు ప్రొషెషనల్ అనే నాలుగో విషయాన్ని కూడా నొక్కి చెప్పారు. తన ఆఫీసులో అదనపు డీజీపీలు, పోలీసు కమీషనర్లు, జిల్లాల ఎస్పీలు, డీసీపీలతో మొదటిసారి భేటీ అయ్యారు. ఈసందర్భంగా ప్రతి పోలీసు విధిగా పాటించాల్సిన, సూత్రాలంటు మూడు ఎఫ్ ల గురించి పాఠాలు చెప్పారు.

మూడు ఎఫ్ లలో మొదటిది ఫెయిర్. ‘ఫెయిర్ పోలీసింగ్’ అంటే ప్రతి పౌరుడిని చట్టంముందు సమానంగా చూస్తు నిష్పక్షపాతంగా న్యాయం అందించాలని. రెండో ఎఫ్ అంటే ‘ఫర్మ్ పోలీసింగ్’. ఫర్మ్ పోలీసింగ్ అంటే భయం లేదా పక్షపాతం లేకుండా చట్టాన్ని అమలుచేస్తు శాంతి, భద్రతలను కాపాడటం. మూడో ఎఫ్ అంటే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’. మూడో ఎప్ లో పౌరులలో విశ్వాసం, సానుభూతి, ఆత్మవిశ్వాసాన్ని పోలీసులు పెంచాలన్నారు. ఇక చివరగా ప్రొషెషనల్ అంటే సామర్ధ్యం, నీతి, క్రమశిక్షణ, జవాబుదారితానంతో పోలీసులు పనిచేయాలని చెప్పారు. ప్రతి పోలీసు నాలుగు సూత్రాలను పాటిస్తే సమాజం బాగుంటుందని డీజీపీ చెప్పారు. ఈనాలుగు సూత్రాలు ఆధునిక పోలీసింగ్ స్పూర్తిని నిర్వచిస్తాయని కూడా అన్నారు.

బేసిక్ పోలీసింగ్ తెలంగాణ పోలీసుల ఆపరేషనల్ వెన్నెముకగా ఉండాలని ఆశించారు. బేసిక్ పోలీసింగులో కీలకమైన బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్ విధులు, అత్యవసర స్పందన, నేర నివారణ, గుర్తింపు, శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటి పోలీసింగ్ తప్పక పాటించాల్సిందే అని ఆదేశించారు. నేరాలసంఖ్య తగ్గితే చాలదని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం కలిగినపుడే పోలీసుశాఖ సమర్ధవంతంగా పనిచేస్తోంది అనటానికి నిజమైన కొలమానమన్నారు. ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికలను అనుసంధానం చేసుకోవటం ద్వారా పోలీసులు సామర్ధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈమధ్యనే నియమితులైన డీఎస్పీలకు ఈనెల 27వ తేదీనుండి శిక్షణ మొదలవుతుందన్నారు.

పోలీసుల పనితీరు ఎలాగుండాలనే విషయంలో కొత్తడీజీపీ చాలావిషయాలు చెప్పారుకాని వాస్తవంగా ఎలా పనిచేస్తున్నారు అనే విషయం శివధరరెడ్డికి తెలీకుండానే ఉంటుందా ? చాలాకాలంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట వింటున్నామే కాని ఆచరణలో ఎంతవరకు అమలవుతోందన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఏదేమైనా కొత్త డీజీపీ నేతృత్వంలో పోలీసుశాఖ పనితీరు మెరుగుపడుతుందని భావిద్దాం.

Tags:    

Similar News