రేవంత్ అసమర్ధుడు కాదు.. ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అసమర్ధ ప్రభుత్వం అన్నాను కానీ రేవంత్ అసమర్ధుడు కాదు అన్నారు.

Update: 2024-04-14 15:58 GMT

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ బీజేపీలోకి వస్తానంటే ఒక స్నేహితుడిగా నేను స్వాగతిస్తాను, హెల్ప్ చేస్తానని అన్నారు. నేను అధిష్టానానికి రికమెండ్ చేస్తాను, తీసుకోవాలా లేదా అనేది బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆలోచిస్తారన్నారు. కానీ రేవంత్ యాక్టివ్ పొలిటీషియన్ కాబట్టి జాయిన్ చేసుకోమని తప్పకుండా రికమండ్ చేస్తానన్నారు. అలాగే "కాంగ్రెస్ అసమర్ధ ప్రభుత్వం అన్నాను కానీ రేవంత్ అసమర్థుడని నేనెప్పుడూ అనలేదు. కాంగ్రెస్ లో ఉంటే ఆయన ఇంకా అసమర్ధుడు అవుతాడు" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధర్మపురి అరవింద్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని, కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ మోచేతికి బెల్లం పెడుతుందని మండిపడ్డారు. జీరో కరెంట్ బిల్లు ఒక నెలకే పరిమితమైందని.. ఆ పార్టీని ప్రజలు తరమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

రేవంత్ రెడ్డి ఆప్ కీ అదాలత్ కామెడీ షో. కాసేపు హిందువుని అంటాడు, కాసేపు నేను ముస్లిం వ్యతిరేకిని అంటాడు. మరి 'రేవంత్ హిందువు అయితే జ్ఞానవాపీ, మధురపై తన స్టాండ్ ఏంటో చెప్పాలి' అంటూ డిమాండ్ చేశారు. కేజీవాల్ జైలు నుంచి పాలన చేయటాన్ని రేవంత్ సమర్థించారు. తాను కూడా జైలు నుంచి పరిపాలన చేయటానికి ప్రిపేర్ అవుతున్నారా..? లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ కావడంతో నిజామాబాద్ లో లిక్కర్ ఫ్రీ ఎలక్షన్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకటం లేదు. ఆ పార్టీకి 30 ఎంపీ సీట్లు కూడా రావు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటానికి నేతలు ఆసక్తి చూపటం లేదు అని రేవంత్ విమర్శించారు.

"కేసీఆర్, కేటీఆర్‌కు ట్యాపింగ్‌తో సంబంధం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గతంలో పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చక్కర ఫ్యాక్టరీని ఎందుకు తెరపించలేదు? ఫోన్ ట్యాపింగ్ అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకుంటారని రేవంత్ రెడ్డికి పేరుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఎంపీ అభ్యర్థులను బరిలోకి దింపాయి అని’ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.

Tags:    

Similar News