కేసీఆర్ ముందున్న ఛాయిస్ ఏమిటి ?
దగ్గరి బంధువులతో చెప్పిస్తే కవిత దారికి వస్తుందని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫెయిలైనట్లు అర్ధమవుతోంది;
కల్వకుంట్ల కవిత తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే షాకిచ్చారా ? అవుననే తెలుస్తోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కవితతో మాట్లాడి సెట్ చేసే ఛాయిస్ కేసీఆర్ కు తక్కువుంది. కేసీఆర్ తరపున ఇద్దరు దూతలు కవిత(Kavitha)తో రాయబారానికి వెళ్ళారు. అయితే ఇద్దరి ప్రతిపాదనలను కవిత తోసిపుచ్చటం ద్వారా తండ్రికి పెద్ద షాకే ఇచ్చినట్లు సమాచారం. కేసీఆర్(KCR) తరపున సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ దివికొండ దామోదర్ రావు, లీగల్ సెల్ నేత గండ్ర మోహనరావు ఇద్దరు విడివిడిగా కవితతో చాలాసేపు భేటీ అయ్యారు. కేసీఆర్ తరపున కవితకు చెప్పాల్సిందంతా చెప్పారు. అయితే కవిత అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ సమాధానం చెప్పలేకపోయారని పార్టీవర్గాలు చెప్పాయి. ఈ భేటీలోనే వీళ్ళు కేసీఆర్ కు ఫోన్ చేసి కవితతో మాట్లాడించినా ఉపయోగం కనబడలేదని సమాచారం.
ముందుగా దామోదరరావు ఉదయం కవిత ఇంటికి వెళ్ళి సమావేశమయ్యారు. కేసీఆర్ తరపున వెళ్ళారు కాబట్టి అధినేత చెప్పిన విషయాలనే చెప్పారు. అయితే అందుకు కవిత అంగీకరించలేదు. ఇంతకీ ఎంపీ చెప్పింది ఏమిటంటే పార్టీలో అల్లరిచేసి పరువు బజారుకు ఈడ్చవద్దని హితవుపలికారు. ఏదన్నా ఉంటే తండ్రితో నేరుగా కూర్చుని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోమన్నారు. ఎంపీ చెప్పిందంతా విన్న కవిత పార్టీలో ప్రస్తుతం తన హోదా ఏమిటి ? భవిష్యత్తులో తనకు దక్కబోయే హోదా ఏమిటనే విషయంలో ఇపుడే కేసీఆర్ నుండి గట్టి హామీ దక్కాలని పట్టుబట్టారు. అయితే ఆ విషయంలో ఎంపీ ఎలాంటి హామీని ఇవ్వలేకపోయారు. అలాగే తండ్రికి తానురాసిన లేఖను ఎవరు లీక్ చేశారనే విషయం కూడా వెంటనే తేలాలి ? వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని పట్టుబట్టినట్లు సమాచారం.
కవిత డిమాండ్లకు, షరతులకు ఏమీ మాట్లాడలేని ఎంపీ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లీగల్ సెల్ నేత గండ్ర మోహనరావు ఇంటికి వచ్చి కవితతో భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు, ప్రత్యర్ధులు రెచ్చిపోవటానికి అవకాశం ఇవ్వటం, తండ్రితో నేరుగా మాట్లాడుకునే విషయాలన్నీ రెండోసారి కవితతో గండ్ర చర్చించినట్లు జాగృతివర్గాలు చెప్పాయి. అయితే ఉదయం అడిగిన హామీలనే కవిత మధ్యాహ్నం గండ్రను కూడా అడిగారు. కవిత ప్రశ్నలకు గండ్ర కూడా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారు. పార్టీలో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీని తండ్రి ఇవ్వనపుడు తన భవిష్యత్తు ఏమిటో తాను చూసుకోగలను అని కవిత దూతలు ఇద్దరితో స్పష్టంగా తెగేసిచెప్పినట్లు పార్టీవర్గా సమాచారం.
మొత్తానికి జరిగింది చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబానికి బాగా దగ్గరి బంధువులతో చెప్పిస్తే కవిత దారికి వస్తుందని కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫెయిలైనట్లు అర్ధమవుతోంది. అటు కేసీఆర్ ఇటు కవిత ఇద్దరికీ బాగా కావాల్సిన దగ్గరి బంధువుల రాయబారమే ఫెయిలైతే ఇక కేసీఆర్ తరపున కవితతో మాట్లాడి నచ్చచెప్పేంత సీన్ పార్టీలో ఎవరికి ఉంటుంది ? అన్నదే ప్రశ్న. రాయబారం ఫెయిలైంది కాబట్టి ఇక కేసీఆరే డైరెక్టుగా కవితతో మాట్లాడాల్సుంటుంది. ఎందుకంటే కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మీదే కవితకు బాగా అసంతప్తిగా ఉందికాబట్టి సోదరుడితో కవిత మాట్లాడే ఛాన్సు చాలా తక్కువే. అందుకనే కేసీఆర్ డైరెక్టుగా మాట్లాడాలి. లేకపోతే షోకాజ్ నోటీసు ఇచ్చి చర్యలకు ఉపక్రమించటం ఒక్కటే మిగిలుంది. మరి కేసీఆర్ ఏమిచేస్తారో చూడాలి.