బీఆర్ఎస్ ను సోషల్ మీడియానే గెలిపిస్తుందా ?

ట్విట్టర్లో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు;

Update: 2025-07-07 08:04 GMT
KTR

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాలను కాకుండా పూర్తిగా సోషల్ మీడియా మీదే ఆధారపడినట్లున్నారు. ఎందుకంటే తెల్లవారి లేచిన దగ్గర నుండి ట్విట్టర్లో ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. అయితే సోషల్ మీడియా(BRS Social Media) లేకపోతే తెలంగాణ భవన్లో మీడియా సమావేశాల్లో మాత్రమే కేటీఆర్ యాక్టివ్ గా ఉంటున్నారు. జిల్లాల్లో తిరగటం, నేతలతో సమావేశాలు పెట్టుకోవటం, సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవటం అన్న విషయాలను కేటీఆర్(KTR) వదిలేసినట్లున్నారు. జిల్లాల నుండి నేతలు ఎవరైనా వచ్చి కలవాలని అనుకున్నపుడు మాత్రమే కేటీఆర్ కలుస్తున్నారు. ఎక్కువభాగం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యారన్నది నిజం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతల్లో ఒకరకమైన నిస్తేజం ఆవరించింది. పార్లమెంటు ఎన్నికల్లో గుండుసున్నా ఫలితం తర్వాత చాలామంది నేతలు నీరుగారిపోయారు. ఇక క్యాడర్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరమేలేదు. తమను ముందుండి నడిపించే నేతలు కరువవ్వటంతో క్యాడర్ పూర్తిగా పక్కకు వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో పార్టీ పోటీనే చేయలేదు. దీనివల్ల నేతలు, క్యాడర్ మొరేల్ పూర్తగా దెబ్బతినేసింది. అసెంబ్లీఎన్నికల్లో ఓటమితర్వాత కేటీఆర్ కొన్నినియోజకవర్గాలను సమీక్షించారు. ఆ సమీక్షలో చాలామంది పార్టీ ఓటమికి నాయకత్వానిదే తప్పంటు రెచ్చిపోయారు. ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న సిట్టింగ్ ఎంఎల్ఏలకే తిరిగి టికెట్లు ఇవ్వటమే పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా చాలామంది ధ్వజమెత్తారు. నేతలు, క్యాడర్ స్పసందన చూసిన తర్వాత కేటీఆర్ సమీక్షా సమావేశాలను రద్దుచేసుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు నేతలతోసమీక్షలు నిర్వహించలేదు.

కేటీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఒకవైపేమో రేవంత్(Revanth) ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ 100 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమని జోస్యాలు కూడా చెబుతున్నారు. మరి ఇదే నిజమైతే ఎంఎల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీచేయలేదని అడిగితే సమాధానం చెప్పరు. పోనీ జనాలకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎందుకు చేయటంలేదని అడిగితే మౌనమే సమాధానం. ఏప్రిల్ 27వ తేదీన జరిగిన ఎల్కతుర్తి బహిరంగసభలో ఇక నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని భీషణ ప్రతిజ్ఞచేసిన కేసీఆర్(KCR) ఇప్పటివరకు ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. ఈవిషయం అడిగితే ఏమీ మాట్లాడరు. తమకు దిశానిర్దేశం చేస్తున్నది కేసీఆరే అని స్టాక్ సమాధానం మాత్రమే చెబుతున్నారు.

కష్టాలొచ్చినపుడు తమకు అండగా నిలవని నేతలను జనాలు పట్టించుకోరన్న చిన్న విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా మరచిపోయినట్లున్నారు. అందుకనే సమస్యలు, పరిష్కారం పేరుతో జనాల్లోకి వెళ్ళటం మానేసి కేవలం సోషల్ మీడియా, మీడియాలో మాత్రమే కేటీఆర్ ఎక్కువగా కనబడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జలవివాదాలు, రైతుల సమస్యలు, విత్తనాలు, ఎరువులు, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ లాంటి సమస్యలపై ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న కేటీఆర్, హరీష్ తమ హయాంలో ఏమి జరిగిందో మరచిపోయినట్లు నటిస్తున్నారు. పై అంశాల్లో ఇఫుడు జరుగుతున్నవే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగాయి. అందుకనే కేటీఆర్, హరీష్ ఆరోపణలు మొదలుపెట్టగానే రేవంత్, మంత్రులు, ఎంఎల్ఏలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన విషయాలను గుర్తుచేసి ఎదురుదాడులు చేస్తున్నారు.

తొందరలోనే స్ధానికసంస్ధలఎన్నికలు జరగుతాయి. ఆతర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బెటర్ గా పెర్ఫామ్ చేస్తేనే జనాల్లో గుర్తింపు దక్కుతుంది లేకపోతే షెడ్యూల్ ప్రకారం జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నానా అవస్తలు పడాల్సిందే. జనాలను వదిలేసి సోషల్ మీడియా, మీడియాను మాత్రమే నమ్ముకున్న కేటీఆర్ ఏమిచేయాలనే విషయంలో తొందరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

Tags:    

Similar News