Revanth|రేవంత్ కు ఫుల్లు సపోర్టు దొరికినట్లేనా ?

పునరుజ్జీవన ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తంచేస్తు కొందరు వేసిన కేసులను కోర్టు కొట్టేసింది.

Update: 2024-11-27 08:57 GMT
Revanth reddy

రేవంత్ రెడ్డి ఫుల్లు హ్యాపీగా ఉండుంటాడు. ఎందుకంటే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు నుండి ఫుల్లు సపోర్టు దొరికినట్లయ్యింది. ఎలాగంటే పునరుజ్జీవన ప్రాజెక్టు పైన అభ్యంతరాలు వ్యక్తంచేస్తు కొందరు వేసిన కేసులను కోర్టు కొట్టేసింది. పైగా మూసీ(Musi river) కబ్జాదారులపైన క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని రేవంత్(Revanth) ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివాసితులకు నోటీసులు ఇచ్చి, తగిన సమయం ఇచ్చి ఇళ్ళను ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇళ్ళను ఖాళీచేయించే పనుల్లో ఉన్న అధికారులకు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివాసితులకు ప్రత్యామ్నాయంగా ఇంకోచోట అనువైన స్ధలాన్ని చూపించాలని ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తాజా ఆదేశాలు, సూచనలతో రేవంత్ కు న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లు అయ్యింది. అందుకనే ఇకనుండి రెట్టించిన ఉత్సాహంతో రేవంత్ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నాడు.

మూనీనదికి రెండువైపులా నివాసాలు ఉంటున్న వారిని అక్కడినుండి తరలించి పునరుజ్జీవన ప్రాజెక్టును మొదలుపెట్టాలని రేవంత్ అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఖాళీచేయించాల్సిన వేలాది ఇళ్ళకు ఆర్బీ(రివర్ బెడ్) అని ఎర్రటి ఇంకుతో మార్క్ కూడా చేశారు. ఇందులో భాగంగానే సుమారు 100 ఇళ్ళని అధికారులు కూల్చేశారు. ఈ సమయంలోనే కొందరు కోర్టులో కేసు వేశారు. మరుతీనగర్ వాసులు వందమంది దాకా కోర్టుకెక్కారు. మొదట్లో ప్రభుత్వ చర్యలపై స్టే ఇచ్చిన హైకోర్టు(Telangana High court) జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి మంగళవారం తీర్పిచ్చారు. తీర్పులో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమణదారులుగా తేలితే వెంటనే ఇళ్ళను కొట్టేయచ్చని చెప్పారు.

ప్రాజెక్టు ప్రభావిత వ్యక్తుల సమగ్ర సమాజిక-ఆర్ధిక సర్వే నిర్వహించి ప్రభుత్వం వారికి అనువైన ప్రత్యామ్నాయ వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల కోసం అధికారులు చేపట్టే సర్వేను పిటీషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోకూడదని స్పష్టంగా చెప్పారు. సర్వే కోసం వెళ్ళే అధికారులకు ప్రభుత్వం అవసరమైన భద్రతను కల్పించాలని ఆదేశించారు. నదులు, నీటివనరులు, సరస్సులు, చెరువుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణలు, భూకబ్జాదారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు తాజా తీర్పుతో ఆక్రమణలు, నిర్మాణాల తొలగించేందుకు రేవంత్ ప్రభుత్వానికి న్యాయపరమైన అడ్డంకులు అన్నీ తొలగిపోయినట్లయ్యింది.

హైకోర్టు తీర్పు నేపధ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేయటానికి వీల్లేకుండా పోయింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులను రెచ్చగొట్టే ఛాన్సు కూడా పోయింది. ఎందుకంటే ఆక్రమణలను తొలగించమని హైకోర్టే స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశంలేదు. సుమారు 100 ఇళ్ళని కూల్చేసి అందులోని నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించి ఇందిరమ్మ డబల్ బెడ్ రూములను ప్రభుత్వం కేటాయించింది. అదే సమయంలో కొందరు కోర్టులో కేసులు వేయటం, స్టే రావటంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. మొత్తానికి ఇపుడు నిలిచిపోయిన పనులు వేగంపుంజుకోబోతున్నాయి. మరి రేవంత్ ఎంత జోరుగా పనులు మొదలుపెడతారో చూడాలి.

Tags:    

Similar News