సిట్ కు బీఆర్ఎస్ నేత షాక్
సిట్ ముందు వాగ్మూలం ఇచ్చేందుకు రమ్మంటే బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveenkumar) ఖాతరుచేయటంలేదు;
టెలిఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు మొదటి ఎదురుదెబ్బ తగిలిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే సిట్ ముందు వాగ్మూలం ఇచ్చేందుకు రమ్మంటే బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveenkumar) ఖాతరుచేయటంలేదు. అసలు ఏమిజరిగిందో తెలుసుకోవాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. బీఆర్ఎస్(BRS) హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ సంక్షేమహాస్టళ్ళ కార్యదర్శిగా పనిచేశారు. నిజానికి ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న ప్రవీణ్ కు సంక్షేమహాస్టళ్ళ బాధ్యతతో ఎలాంటి సంబంధంలేదు. అయితే తాను ప్రత్యేకంగా రిక్వెస్టుచేసిన కారణంగా కేసీఆర్(KCR) కూడా అనుమతించి సెక్రటరీగా నియమించారు.
కొంతకాలం సెక్రటరీగా పనిచేసిన ప్రవీణ్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వచ్చంధ ఉద్యోగవిరమణ చేశారు. ఎందుకు చేశారంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కోసం. కొత్తపార్టీ పెట్టే విషయమై ఆలోచించిన ప్రవీణ్ తర్వాత ఆలోచన మానుకుని బీఎస్పీలో చేరారు. బీఎస్పీలో చేరిన ప్రవీణ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అభ్యర్ధులను పోటీచేయించటమే కాకుండా తాను సిర్పూర్ నియోజకవర్గంలో పోటీచేయటం, ఓడిపోవటం అందరికీ తెలిసిందే. ఎన్నికలసమయంలో ప్రచారానికి వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో కేసీఆర్ పాలనపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పించారు. ఆతతర్వాత ఏమైందంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు.
తర్వాత ఏమిజరిగిందో తెలీదుకాని ప్రవీణ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ప్రవీణ్ చర్యలతో అందరు ఆశ్చర్యపోయారు. ఎన్నికలసమయంలో ఎవరిమీదైతే ప్రవీణ్ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారో ఎన్నికల తర్వాత అదే పార్టీలో చేరి, అదే అధిపతినాయకత్వంలో పనిచేయటానికి ఎందుకు నిర్ణయించుకున్నారో ప్రవీణే చెప్పాలి. బీఆర్ఎస్ లో చేరిన దగ్గర నుండి కేసీఆర్ ను వెనకేసుకొస్తు, రేవంత్ పై పూర్తిస్ధాయిలో ధ్వజమెత్తుతున్న విషయం అందరుచూస్తున్నదే.
ఇపుడు విషయం ఏమిటంటే టెలిఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు రెండునోటీసులు జారీచేసినా స్పందించటంలేదు. విచారణకు రావాలని ఇచ్చిన నోటీసులను ప్రవీణ్ లెక్కచేయటంలేదు. ఎన్నికల సమయంలో తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఇపుడు ట్యాపింగ్ కేసును విచారిస్తున్న అధికారులకు కూడా ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయమై ఆధారాలు దొరికాయి. అందుకనే సిట్ అధికారులు ప్రవీణ్ కు నోటీసు జారీచేసి మొన్నటి సోమవారం వాగ్మూలం ఇచ్చేందుకు రమ్మని కోరారు. బుధవారం విచారణకు హాజరవ్వాల్సిన ప్రవీణ్ నోటీసును పట్టించుకోలేదు. అందుకని మరోనోటీసు జారీచేసిన అధికారులు మొన్నటి శుక్రవారం హాజరుకావాలని కోరారు. రెండో నోటీసుకు కూడా ప్రవీణ్ స్పందించలేదు. దాంతో ప్రవీణ్ అసలు విచారణకు హాజరయ్యే విషయం అనుమానంగా తయారైంది. ఇప్పటివరకు సిట్ నోటీసులు అందుకున్న వారందరు విచారణకు హాజరైన విషయం అందరికీ తెలిసిందే.
ప్రవీణ్ మీద అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇపుడు కేసీఆర్ కు ప్రవీణ్ వీరాభిమానిగా మారారు. ఆరోపణలు చేసినపుడేమో బద్ధవిరోధిగా ఉన్న ప్రవీణ్ మారిన పరిస్ధితుల కారణంగా వీరాభిమాని అయిపోయారు. అప్పట్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను ఇపుడు కట్టుబడి ఉండేస్ధితిలో లేరు. అప్పుడుచేసిన ఆరోపణలకే ప్రవీణ్ ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటే కేసీఆర్ పుట్టిముణుగుతుంది. అందుకనే ప్రవీణ్ ప్లేటు ఫిరాయించారని అందరు అనుమానిస్తున్నారు. సిట్ విచారణకు హాజరై వాగ్మూలమిస్తే తన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు అంగీకరించాల్సుంటుంది. అంగీకరిస్తే కేసీఆర్ ఫోన్ ట్యాపింగును బీఆర్ఎస్ సీనియర్ నేతే అంగీకరించారనే గోల పెరిగిపోతుంది. ఇదే జరిగితే రాజకీయంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు చాలా ఇబ్బందులు మొదలవుతాయి.
ఒకవేళ అంగీకరించకపోతే అప్పట్లో తాను తప్పుడు ఆరోపణలు చేశానని అయినా అంగీకరించాల్సుంటుంది. తప్పుడు ఆరోపణలు చేశానని ఒప్పుకుంటే ప్రవీణ్ క్రెడిబులిటీకే దెబ్బ. పై రెండింటిలో ప్రవీణ్ ఏదీచేయలేరు. ఎందుకంటే ప్రవీణ్ ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయించారు అనేందుకు సిట్ దగ్గర రికార్డెడ్ ప్రూఫుంది. తన ఫోన్ ను కేసీఆర్ ట్యాప్ చేయించారన్న విషయం ప్రవీణ్ కు బాగా తెలుసు. అయితే తాను ఇపుడు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి అధినేతను రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. విచారణకు హాజరైతే ఏదో ఒకటి కమిట్ అవ్వాలి కాబట్టే అసలు విచారణకే గైర్హాజరైతే సరిపోతుందని ప్రవీణ్ అనుకున్నట్లున్నారు. అందుకనే రెండు నోటీసులు జారీచేసినా ప్రవీణ్ ఎలాంటి సమాధానం ఇవ్వటంలేదు. సో, జరుగుతున్నది చూస్తుంటే ప్రవీణ్ రూపంలో సిట్ కు మొదటి ఎదురుదెబ్బ తగిలినట్లు అనుకోవాల్సుంటుంది. మరి ప్రవీణ్ విషయాన్ని సిట్ ఏ విధంగా డీల్ చేస్తుందో చూడాలి.