క్రెడిట్ లిమిట్ పెంచుతామని వృద్దుడికి టోకరా
రూ 2.03 లక్షలు డెబిట్ కావడంతో పోలీసులకు సమాచారం;
ఆన్ లైన్ మోసాలు శృతిమించుతున్నాయి. రిటైర్మెంట్ వయసులో ఉన్నవారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. పైసా పైసా కూడబెట్టుకున్నదంతా కొన్ని సెకన్లలో చేజిక్కించుకుంటున్న ముఠాలు హైద్రాబాద్ లో పని చేస్తున్నాయి. అప్రమత్తత ఉండడం వల్ల సైబర్ నేరగాళ్లను కట్టడి చేయవచ్చని పోలీసులు అంటున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది ఈ ఘటన. హైద్రాబాద్ షేక్ పేట కు చెందిన 67 ఏళ్ల వృద్దుడికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ వేశారు. క్రెడిట్ లిమిట్ పెంచుతామని వృద్దుడిని మగ్గులో దింపారు. హెచ్ డిఎఫ్ సి బ్యాంకు కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామని వృద్దుడికి వీడియో కాల్ చేశారు. మేం కాల్ చేసినప్పుడే వివరాలు ఎంటర్ చేయాలని కండిషన్ పెట్టారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు వృద్దుడు చేశాడు. రెండున్నర లక్షల క్రెడిట్ లిమిట్ పెరిగిందని 24 గంటల్లో అప్ డేట్ అవుతుందని చెప్పి ఫోన్ కట్ చేశారు. బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేస్తే రూ 2. 03 లక్షలు ఖాతా నుంచి మాయమయ్యాయి. తన డబ్బులు డెబిట్ అయ్యాయని తెలుసుకున్న వృద్దుడు తాను మోసపోయాయని గ్రహించి ఆందోళన చెందాడు. వెంటనే సైబర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.