42 మృతదేహాల గుర్తింపుకు డీఎన్ఏ టెస్టులు

అక్కడ పనిచేస్తున్న వారిలో చాలామంది ఎగిరి సుమారు 300 అడుగుల దూరంలో పడ్డారు.;

Update: 2025-07-01 03:01 GMT
pasamilaram fire accident

మృతదేహాలను గుర్తించటానికి డీఎన్ఏ టెస్టు చేయించటం ఒకటే మార్గమని ప్రభుత్వం డిసైడ్ చేసింది. హైదరాబాద్, పటాన్ చెరులోని పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ(Sigachi chemical factory)లో సోమవారం జరిగిన అగ్నప్రమాదంలో 42 మంది చనిపోయిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన 35 మందిని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స నిమ్మితం చేర్పించారు. వీరిలో పదిమంది పరిస్ధితి విషమంగా ఉందని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. ఇంకా 27 మంది ఆచూకీ తెలీలేదు. బహుశా వీళ్ళంతా కూడా ప్రమాదంలోనే చిక్కుకుపోయుంటారని సంబంధిత అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ బాయిలర్లలో 800 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు తెలిసింది.

బ్లాస్ట్ ఏస్ధాయిలో జరిగిందంటే పేలుడుధాటికి మూడంతస్తుల పై కప్పు, గోడల బద్దలైపోయాయి. అలాగే అక్కడ పనిచేస్తున్న వారిలో చాలామంది ఎగిరి సుమారు 300 అడుగుల దూరంలో పడ్డారు. ఇప్పటివరకు 37 మంది మృతదేహాలను సహాయసిబ్బంది బయటకు తీసుకొచ్చారు. అయితే బయటకు తీసుకొచ్చిన మృతదేహాలు ఎవరి అన్న విషయం గుర్తించటం సమస్యగా మారింది. అందుకనే మృతదేహాలకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆసుపత్రుల్లో డీఎన్ఏ టెస్టులు చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా మృతదేహాలు మాడిపోయాయి. చనిపోయిన వారెవరో, ఫ్యాక్టరిలో ఇంకా చిక్కుకుపోయిన వారెవరో ఫ్యాక్టరి యాజమాన్యంతో పాటు కార్మికుల కుటుంబసభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. ఉద్యోగానికి వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవటం ఒకటే ఉద్యోగులు కెమికల్ ఫ్యాక్టరిలో చనిపోయుంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఇదేవిషయాన్ని ఫ్యాక్టరి యాజమాన్యంతో పాటు పోలీసులకు కూడా చెబుతున్నారు. అందుకనే ఇప్పటికి బయటకుతీసుకొచ్చిన మృతదేహాలకు ఉద్యోగుల కుటుంబసభ్యులకు డీఎన్ఏ టెస్టు(DNA Tesats)లు చేయిస్తే కాని మృతదేహాలు ఎవరివి అన్న విషయంలో క్లారిటిరాదు. అందుకనే కుటుంబసభ్యుల సాయంతో డీఎన్ఏ టెస్టుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈమధ్యనే అహ్మదాబాద్ విమానదుర్ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. విమానప్రమాదంలో మరణించిన 272 మందిని గుర్తించేందుకు అక్కడ కూడా డీఎన్ఏ టెస్టులు చేయించాల్సొచ్చింది. ఎందుకంటే మృతదేహాలన్నీ గుర్తుపట్టడానికి వీల్లేకుండా మాడి బొగ్గులాగ మారిపోవటంతో మృతుల కుటంబసభ్యులతో డీఎన్ఏ టెస్టులు చేయించాల్సొచ్చింది.

దుర్ఘటన స్ధలానికి రేవంత్

మరికొద్దిసేపటిలో దుర్ఘటన జరిగిన సిగాకి కెమికల్ ఫ్యాక్టరిని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) సందర్శించబోతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి చికిత్సకు అత్యుత్తమ స్ధాయిలో వైద్యం అందించాలని ఇప్పటికే రేవంత్ ఆదేశించారు. సోమవారం ప్రమాద విషయం తెలిసిన దగ్గరనుండి మంత్రులు గడ్డం వివేక్, దామోదర రాజనర్సింహ ఫ్యాక్టరి దగ్గరే ఉండి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగింది కెమికల్ ఫ్యాక్టరి కాబట్టి సంబంధిత ఉన్నతాధికారులు మామూలు జనాలు ఎవరినీ ఫ్యాక్టరి దగ్గరకు రానీయటంలేదు. ఫ్యాక్టరిలో బాయిలర్లు పేలాయి కాని రియాక్టర్లు కాదని అగ్నిమాపక శాఖ ఐజీ నాగిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో కెమికల్ ప్రభావం ఏమీలేదని కూడా అధికారులు తేల్చారు. ప్యాక్టరీని సందర్శించిన సమయంలో రేవంత్ ఏమి చెబుతారో చూడాలి.

Tags:    

Similar News