తెలంగాణలో ఫిరాయింపులు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా ?
నిజానికి ఆ తీర్పు ఎలాగుందంటే ఎవరికి ఇష్టంవచ్చినట్లు వాళ్ళు అన్వయించుకునేట్లుగా ఉంది.;
ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది పార్టీ ఫిరాయింపులనే చెప్పాలి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలకు సంబంధించి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ ధర్మాసనం తీర్పుచెప్పింది. నిజానికి ఆ తీర్పు ఎలాగుందంటే ఎవరికి ఇష్టంవచ్చినట్లు వాళ్ళు అన్వయించుకునేట్లుగా ఉంది. ద్విసభ్య ధర్మాసనం తీర్పులో ఫిరాయింపులకు షాక్ ఏమీ ఇవ్వలేదు. అలాగే బీఆర్ఎస్(BRS) సంబరాలు చేసుకునేందుకూ లేదు. పైగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కోరినట్లుగా ఫిరాయింపులపై అనర్హత వేటు వేసేందుకు సుప్రింకోర్టు సాధ్యంకాదుపొమ్మంది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయటం తమపనికాదని చెప్పింది. అనర్హత అంశం అసెంబ్లీ స్పీకర్ పరిధిలోని అంశంగా చెప్పింది. ఈమొత్తం తీర్పులో బీఆర్ఎస్ కోణంలో ప్లస్ ఏమిటంటే వీలైనంత తొందరలో, మూడుమాసాల్లోగా అనర్హతపై యాక్షన్ తీసుకోవాలని మాత్రమే చెప్పింది. అదికూడా ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలని ఎక్కడా ఆదేశించలేదు.
ఇంతోటి తీర్పుకే కేటీఆర్ తదితరులు ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హతవేటు పడిపోయినట్లుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఫిరాయింపులపై అనర్హత వేటుఖాయమని, పదినియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రాబోతున్నాయని, పార్టీ నేతలంతా బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించేందుకు కష్టపడాలని ఏమిటేమిటో చెప్పేశారు. కాంగ్రెస్ రాజకీయాలకు సుప్రింకోర్టు తీర్పు చెంపపెట్టని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ నోటికొచ్చింది ఏదైనా మాట్లాడేస్తారు. తాము అధికారంలో ఉన్నపుడు ఏమిచేశామనే విషయాన్ని మరచిపోయినట్లు నటిస్తున్నారు.
ఫిరాయింపులకు సంబందించి ఒకసారి చరిత్రలోకి తొంగిచూడాలి. సమైక్య రాష్ట్రంలో ఏమిజరిగిందన్నది ఇపుడు అప్రస్తుతం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. ‘‘తెలంగాణ తెచ్చుడో...కేసీఆర్ చచ్చుడో’’, ‘‘చావునోట్లో తెలపెట్టి తెలంగాణ తెచ్చాను’’ అనే భారీ డైలాగులు చెప్పిన కేసీఆర్ పార్టీకి జనాలిచ్చింది కేవలం 63 సీట్లు మాత్రమే. 119 ఎంఎల్ఏల సీట్లున్న అసెంబ్లీలో అప్పటి టీఆర్ఎస్ గెలుచుకున్నది కేవలం 63 సీట్లే. కాంగ్రెస్ నుండి 21 మంది, టీడీపీ నుండి 15 మంది ఎంఎల్ఏలు గెలిచారు.
కాంగ్రెస్ నుండి గెలిచిన 21మందిలో కేసీఆర్ ఏడుగురు ఎంఎల్ఏలను లాగేసుకున్నారు. అలాగే 15 మంది టీడీపీ ఎంఎల్ఏల్లో 12 మందిని గుంజేసుకున్నారు. అలాగే బీఎస్పీ తరపున గెలిచిన ఇద్దరిలో ఇద్దరినీ, వైసీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంఎల్ఏలను కూడా కేసీఆర్ లాగేసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైసీపీ ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిళ్ళుపెట్టి ఏది వీలైతే అదిచేసి 24 మంది ఇతరపార్టీల ఎంఎల్ఏలను యధేచ్చగ ఫిరాయింపులతో కేసీఆర్ లాగేసుకున్నది వాస్తవం. ఇదేసమయంలో కాంగ్రెస్ కు చెందిన 12మంది ఎంఎల్సీలు, ఇద్దరు టీడీపీ, ఇద్దరు టీచర్ ఎంఎల్సీలను కూడా వదల్లేదు. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే తెలంగాణలో ఫిరాయింపులకు తెరలేపిందే కేసీఆర్ అని. 2014 ఎన్నికలను పక్కనపెట్టేస్తే తర్వాత 2018లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఆఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 2018 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా కేసీఆర్ ఊరుకున్నారా అంటే లేదు. కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మందిలో 12 మందిని లాక్కున్నారు. టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎంఎల్ఏలను లాగేసుకున్నారు.
అంటే ఇపుడు ఫిరాయింపులపై నీతి కబుర్లుచెబుతున్న బీఆర్ఎస్ పార్టీయే ఫిరాయింపులకు తెరలేపింది. అప్పట్లో ఫిరయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్, టీడీపీ నేతలు స్పీకర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. చివరకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించలేదు. అధికారంలో ఉన్నపుడు చట్టం, న్యాయం, చట్టసభల్లాంటి అంశాల్లో దేన్నీ పట్టించుకోని కేసీఆర్, కేటీఆర్ ఇపుడు మాత్రం అవే అంశాలను ప్రస్తావిస్తు నానా గోలచేస్తున్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ మరచిపోయారు. అప్పట్లో తాము యధేచ్చగా పాల్పడిన ఫిరాయింపు రాజకీయాలే ఇపుడు తమకు ఎదురయ్యేటప్పటికి తట్టుకోలేకపోతున్నారు. సుప్రింకోర్టు తాజా తీర్పునేపధ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏమిచేస్తారో చూడాలి.
తీర్పును చూడాలి : స్పీకర్
సుప్రింకోర్టు తీర్పులో ఏముందో చూడాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హత విషయంలో సుప్రింకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తానని తెలిపారు. సుప్రింకోర్టు తీర్పు ఇంకా తనకు అందలేదని ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
తీర్పులో స్పష్టత లేదు: మెదక్ ఎంపీ
ఇదేవిషయమై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందనరావు మాట్లాడుతు సుప్రింకోర్టు తీర్పులో స్పష్టత లేదన్నారు. మూడునెలల్లో యాక్షన్ తీసుకోవాలని ఆదేశించిన కోర్టు, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తర్వాత ఏమిటనే విషయమై సుప్రింకోర్టు స్పష్టత ఇవ్వలేదన్నారు.
నిర్ణయం తీసుకోవాల్సిందే: కే రామకృష్ణారెడ్డి
ఫిరాయింపు ఎంఎల్ఏల మీద సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిందే అని సీనియర్ అడ్వకేట్ కే రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంఎల్ఏలు పార్టీమారటానికి సమర్ధనీయమైన కారణం ఏదైనా ఉంటే అదే విషయాన్ని స్పీకర్ ముందు చెప్పుకుని అనుకూల నిర్ణయం పొందచ్చని చెప్పారు.
రాజ్యాంగవిధులను స్పీకర్ అడ్డుకోలేరు : ఎ. సత్యప్రసాద్
ఫిరాయింపులపై నిర్ణయంతీసుకోవటానికి నిర్దిష్టకాలపరిమితి లేదనిచెప్పటం తప్పని సీనియర్ లాయర్ ఎ. సత్యప్రసాద్ చెప్పారు. కాలపరిమితిలేదన్న సాకుతో ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకపోవటం రాజ్యంగ విధులను అడ్డుకోవటమే అవుతుందన్నారు.