తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు,వేసవి ఫ్లూ కేసులతో వైద్యుల హెచ్చరికలు
తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలకు హైదరాబాద్ ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు.;
By : The Federal
Update: 2025-03-27 00:45 GMT
తెలంగాణ రాష్ట్రంలో వేడిగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి.(Rising Temperatures) ఆదిలాబాద్ జిల్లాలో 41.0 డిగ్రీల సెల్షియస్, నిజామాబాద్ లో 40.9, భద్రాద్రి కొత్తగూడెంలో 40.7 డిగ్రీలు, కామారెడ్డిలో 40.6డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల అంతటా పొడి గాలులు వీస్తుండటంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
మార్చి 27, 30వతేదీల మధ్య ఉత్తర,తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్షియస్ నుంచి 43 డిగ్రీల సెల్షియస్ మధ్య పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో 38డిగ్రీల సెల్షియస్ నుంచి 40డిగ్రీల సెల్షియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో చార్మినార్, ఉప్పల్, బేగంపేట, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38.6డిగ్రీల సెల్షియస్ నమోదైంది.
ఐఎండీ హెచ్చరిక జారీ
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ ఐఎండీ అధికారులు గురువారం హెచ్చరిక జారీ చేశారు.(IMD Officials Warn) మార్చి నెలలో హైదరాబాద్‌లో గతంలో నమోదైన సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. దీంతో పలు జిల్లాలకు హైదరాబాద్ ఐఎండీ అధికారులు వేడిగాలుల హెచ్చరికను జారీ చేశారు.
పెరుగుతున్న వేసవి ఫ్లూ కేసులు
అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం వల్ల వేసవి ఫ్లూ కేసుల సంఖ్య (Summer Flu Cases)పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, అలసటతో బాధపడుతున్న రోగులు ఆసుపత్రులు, క్లినిక్ లకు వస్తున్నారని వైద్యులు చెప్పారు. బయట మండుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఇళ్లలోపల చల్లగా ఉండటంతో ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుల వల్ల ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని హైదరాబాద్ నగరంలోని ఆశ్రిత ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ రామమోహన్ రావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గొంతు నొప్పి, తలనొప్పి, శరీర నొప్పులు, జ్వరం కేసుల సంఖ్య పెరుగుతుందని డాక్టర్ పేర్కొన్నారు. వికారం, విరేచనాలు, జీర్ణ సమస్యలతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని డాక్టర్ వివరించారు.
ద్రవపదార్థాలు అధికంగా తీసుకోండి
మండుతున్న ఎండల్లో ప్రయాణించి వచ్చి ఏసీ చల్లని గాలికి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గి వైరస్ లు దాడి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మంచినీరు, ద్రవపదార్థాలు సరిగా తీసుకోక పోవడం వల్ల డీ హైడ్రేషన్ గురవుతున్నారని వైద్యులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు తగినంత మంచినీరు తాగక పోవడంతో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరిగిందని వైద్యులు హెచ్చరించారు.(Doctors Warn) మంచినీటితోపాటు ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవడంతోపాటు తేలికపాటి పోషకమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేశారు.
ఎండలో తిరగొద్దు : వైద్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్
తెలంగాణ రాస్ట్రంలో గడచిన మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు ఎండలు మండుతున్నందున ప్రజలు బయట తిరగవద్దని ఆయన కోరారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత మంచినీరు, నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు తాగాలని, బయటకు వెళ్లేటపుడు మంచినీళ్ల బాటిల్ వెంట తీసుకువెళ్లాలని కోరారు.