10 గంటలు అజారుద్దీన్ను బౌన్సర్లతో ఈడీ అదరగొట్టేసిందా ?

ప్రపంచదేశాలను తన బ్యాటింగుతో బెదరగొట్టిన అజహరుద్దీన్ పై ఈడీ బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసిందనే అనుకోవాలి.

Update: 2024-10-09 06:30 GMT
Mohammed Azharuddin

ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మొహమ్మద్ అజహరుద్దీన్ విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం విచారణకు పిలిపించిన ఈడీ(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) రాత్రివరకు రకరకాలుగా ప్రశ్నలతో బెంబేలెత్తించేసినట్లు సమాచారం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచదేశాలను తన బ్యాటింగుతో బెదరగొట్టిన అజహరుద్దీన్ పై ఈడీ బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసిందనే అనుకోవాలి. ఏకధాటిగా 10 గంటలపాటు విచారించిందంటే మామూలు విషయంకాదు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతు తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. కాబట్టి ఎలాంటి విచారణను అయినా ఎదుర్కొంటానని స్పష్టంగా ప్రకటించారు. ఈడీ అడిగిన అన్నీ ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పినట్లు వివరించారు.

ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా అజరుద్దీన్ ఉన్నపుడు కోట్ల రూపాయలు దారిమళ్ళినట్లు ఆరోపణలున్నాయి. మనీల్యాండరింగ్ కు పాల్పడి, షెల్ కంపెనీలకు సుమారు 3.8 కోట్ల రూపాయలను దారిమళ్ళించినట్లుగా ఉప్పల్ పోలీసుస్టేషన్లో అజరుద్దీన్ పై ఫిర్యాదు దాఖలైంది. అజరుద్దీన్ తో పాటు ప్రముఖ క్రికెట్ శివలాల్ యాదవ్, హెచ్సీఏలో కీలకపాత్ర పోషించిన బెల్లంపల్లి కాంగ్రెస్ ఎంఎల్ఏ గడ్డం వినోద్ తదితరులపైన కూడా పోలీసు కేసు నమోదైంది. మనీల్యాండరింగ్, షెల్ కంపెనీల ఆరోపణలున్నాయి కాబట్టి ఉప్పల్ పోలీసులు కేసును ఈడీకి బదిలీచేశారు.

ఇప్పటికే అసోసియేషన్లోని కొందరిని విచారించిన ఈడీ తాజాగా అజరుద్దీన్ ను ఏకధాటిగా పదిగంటలు విచారించింది. అవసరమైతే దసరా పండుగ తర్వాత మరోసారి విచారణకు రావాల్సుంటుందని చెప్పిందని సమాచారం. అలాగే అసోసియేషన్లో కీలకపాత్ర పోషించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా ఈడీ విచారించబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అంతర్జాతీయంగా ఎంతో పాపులరైన అజరుద్దీన్, క్రికెట్ ఇండియాకు కెప్టెన్ గా చేసి బెట్టింగ్ ఆరోపణలపై తన కెరీరును అర్ధాంతరంగా ముగించుకున్నాడు. బెట్టింగ్ ఆరోపణలకు ముందు క్రికెట్ ఆదే దేశాల్లో అజరుద్దీన్ అంటే తెలియని వారుండరు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అజరుద్దీన్ చివరకు బెట్టింగ్ కు పాల్పడ్డాడనే ఆరోపణలతో కెరీర్ కు దూరమవ్వటమే బాధాకరం. ఆరోపణలు రాగానే అజరుద్దీన్ను బోర్డాఫ్ క్రికెట్ ఫర్ ఇండియా (బీసీసీఐ) క్రికెట్ నుండి నిషేధించటమే కాకుండా ఫిర్యాదు కూడా చేసింది.

దాంతో అప్పటివరకు తాను సంపాదించుకున్న క్రేజంతా ఒక్కసారిగా దెబ్బతినేసింది. క్రికెట్ అభిమానులు అజరుద్దీన్ అంటే ఏహ్యభావం పెరిగిపోయింది. దాంతో చాలాకాలం ఈ క్రికెటర్ పబ్లిక్ లోకి రాలేకపోయారు. కేసులు, దర్యాప్తులు, కోర్టులో విచారణల తర్వాతే అజరుద్దీన్ కోలుకుని బయటకు అడుగుపెట్టారు. ఆ తర్వాత హెచ్సీఏకి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేసి గెలిచారు. అధ్యక్షుడిగా క్రికెట్ ఎదుగుదలకు, మంచి ఆటగాళ్ళను గుర్తించటం, సానపట్టడం, అద్భుతమైన ప్లేయర్లుగా తీర్చిదిద్ది ఇండియా క్రికెట్ జట్టులో ఆడేట్లుగా యువ క్రికెటర్లను ప్రోత్సహించి ఉండాల్సుంది. కాని అజరుద్దీన్ ఆ వైపు ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. పైగా ఆర్ధిక ఆరోపణల్లో కూరుకుపోయారు. నిజానికి దారిమళ్ళించారన్న ఆరోపణలు కేవలం రు. 3.8 కోట్లు మాత్రమే.

నిజానికి అజరుద్దీన్ సంపాదించిన నేమ్, ఫేమ్, మనీ ముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న రు. 3.8 కోట్లు ఎందుకు పనికిరాదు. అయినా సరే ఇంతచిన్న మొత్తానికి కూడా కక్కుర్తిపడ్డారనే ముద్ర అజరుద్దీన్ పై పడింది. దాంతో ఇపుడు ఈడీ దర్యాప్తును ఎదుర్కోవాల్సొచ్చింది. ఈ దర్యాప్తులో గనుక మనీల్యాండరింగ్, షెల్ కంపెనీల ఏర్పాటుచేశారనే ఆరోపణలకు ఆధారాలు దొరికితే అజరుద్దీన్ మళ్ళీ కేసుల్లో ఇరుక్కోవటం ఖాయం.

Tags:    

Similar News