జగపతిబాబును విచారించిన ఈడీ

సాహితీ ఇన్ ఫ్రా కేసులో లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన అధికారులు

Update: 2025-09-25 13:54 GMT

నటుడు జగపతిబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించారు. గురువారం ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జగపతి బాబుని నాలుగు గంటలపాటు ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో జగపతిబాబును ఈడీ విచారణకు పిలిచింది. సాహితీ తరఫున జగతిబాబు అనేక ప్రకటనల్లో నటించారు. జగపతిబాబుకు, సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్‌లో నుంచి జగపతిబాబుకు నగదు బదిలీ అయినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు వెల్లడి కావడంతో ఈడీ అధికారులు విచారణ చేశారు. ప్రకటనల్లో నటించినందుకు జగపతి బాబు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.

ప్రీ లాంచింగ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా 248.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అపార్ట్‌మెంట్లు, విల్లాల నిర్మాణం పేరిట కొనుగోలుదారుల నుంచి వసూలు చేసింది అనే ఆరోపణలున్నాయి. వసూలు చేసిన సొమ్ముతో విల్లాలు, అపార్ట్ మెంట్లు కట్టకుండానే సాహితీ ఇన్ ఫ్రా బోర్డు తిప్పేసినట్లు ఫిర్యాదు రావడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. వసూలు చేసిన మొత్తంతో నిర్మాణాలు చేపట్టకుండా ఆ డబ్బులతో ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈడీ అధికారులు సాహితీ ఆస్తులను జప్తు చేశారు.

Tags:    

Similar News