రాములోరి పెళ్ళికి ‘ఎన్నికల కోడ్’ దెబ్బ

కనీసం టీవీల ముందైనా కూర్చుని కల్యాణమహోత్సవాన్ని చూడాలని అనుకోని తెలుగువాళ్ళు దాదాపుండరు. అలాంటిది రాములోరి కల్యాణానికి ఎన్నికల కోడ్ అడ్డుపడుతోంది.

Update: 2024-04-16 04:16 GMT

‘శ్రీ సీతారాముల కల్యాణం చూతమురారండి’ అంటు వాడవాడల మారుమోగే పాటను వినని తెలుగువారండరు. శ్రీరామనవమి సందర్భంగా తెలుగువాళ్ళు ఎక్కడుంటే అక్కడల్లా ఎంతో ఘనంగా శ్రీరామనవమి పండుగను చేసుకుంటారు. శ్రీరామనవమి పండుగ ప్రాశస్ధ్యం ఏమిటంటే సీతారాముల కల్యాణమే. సీతారాముల కల్యాణం కమనీయం అని అందుకనే పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి అంటే తెలుగువాళ్ళందరికీ ముందుగా గుర్తుకొచ్చేది భద్రాచలం ఆలయంలో కన్నులపండువగా జరిగే సీతారాముల కల్యాణమే. నేరుగా భద్రాచలం ఆలయానికి వెళ్ళి సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం దక్కకపోయినా కనీసం టీవీల ముందైనా కూర్చుని కల్యాణమహోత్సవాన్ని చూడాలని అనుకోని తెలుగువాళ్ళు దాదాపుండరు. అలాంటిది రాములోరి కల్యాణానికి ఎన్నికల కోడ్ అడ్డుపడుతోంది.

భద్రాచలం ఆలయంలో చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రాల నుండి సుమారు లక్షమంది కల్యాణమహోత్సవాన్ని చూడటానికి వస్తారని అందరికీ తెలిసిందే. గడచిన 40 ఏళ్ళుగా కోట్లాదిమంది టీవీల ముందు కూర్చుని సీతారామకల్యాణాన్ని కనులార చూస్తున్నారు. అలాంటిది ఇపుడు ఎన్నికల కోడ్ కారణంగా సీతారామకల్యాణాన్ని చూసే భాగ్యాన్ని కోట్లాదిమంది కోల్పోతున్నారు. తెలంగాణాలో మే 13వ తేదీన పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవబోతున్నది. ఆరోజు నుండే అభ్యర్ధుల నుండి నామినేషన్లు కూడా తీసుకుంటారు. ప్రధాన పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్ధులందరు ప్రచారం చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ సమమయంలోనే 17వ తేదీ అంటే బుధవారం శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరామనవమి అంటేనే భద్రాచలం ఆలయంలో సీతారాములకల్యాణమని పైనే చెప్పుకున్నాం. ఉదయం 10.30 నుండి 12.30 మధ్యలో సీతారామకల్యాణం జరుగుతుంది. అలాగే 18వ తేదీ ఉదయం 9 నుండి 10.30 గంటల మధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ‘మహా పట్టాభిషేకం’ జరుగుతుంది.

ఈ కల్యాణమహోత్సవంతో పాటు మహాపట్టాభిషేకాన్ని ప్రతిఏడాది ఎంతో వైభవంగా జరుపుతారు. ఆకల్యాణాన్ని లైవ్ రిలే ఇవ్వటంవల్లే కోట్లాదిమంది భక్తులు దర్శించుకోగలుగుతున్నారు. అలాంటిది ఇపుడు ఎన్నికల సమయంలో శ్రీరామనవమి వచ్చిందని చెప్పి చీఫ్ ఎలక్షన్ కమీషన్ సీతారామకల్యాణ మహోత్సవాన్ని లైవ్ రిలే ఇవ్వకూడదని ఆదేశించింది. లైవ్ రిలే ఇవ్వటం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించటమే అని స్పష్టంగా చీఫ్ సెక్రటరీకి చెప్పింది. భద్రాచలం ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని లైవ్ రిలే ఇవ్వటానికి ఎన్నికల కోడ్ కు సంబంధంలేదని చీఫ్ సెక్రటరి చెప్పినా కమీషన్ వినిపించుకోలేదు. దాంతో కల్యాణ్ మహోత్సవాన్ని లైవ్ లో ఇవ్వకుండా కనీసం అర్ధగంట ఆలస్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయటానికి ఒప్పుకునేట్లుగా ప్రభుత్వం ఎన్నికల కమీషన్ తో మాట్లాడుతోంది.

ఇదే విషయమై జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లుడుతు సీతారాముల కల్యాణానికి ఎన్నికల కోడ్ కు అసలు సంబంధమే లేదన్నారు. అయినా ఎవరో ఇచ్చిన ఫిర్యాదును కమీషన్ పరిగణలోకి తీసుకోవటమే ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని లైవ్ రిలే ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. ఎన్నికల కోడ్ పేరుతో కల్యాణ మహోత్సవాన్ని లైవ్ రిలే ఆపేయటం ఇదే మొదటిసారన్నారు. సీతారామకల్యాణం లైవ్ రిలేలో రాజకీయాలు చొరబడటం నిజంగా దురదృష్టకరమని తుమ్మల చెప్పారు. కోడ్ పేరుతో లైవ్ రిలే ఆపేయటంలో ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో చూడాలని అనుకున్న కోట్లాదిమంది భక్తులకు తీవ్రనిరాస తప్పటంలేదన్నారు.

Tags:    

Similar News