రేవంత్‌పై ఈటల, కేటీఆర్ జాయింట్ ఎటాక్
ప్రభుత్వం నీది.. నువ్వు ఎలాంటి విచారణ అయినా చేయంటూ రేవంత్‌కు ఈటల ఛాలెంజ్.;
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకు మూడు పార్టీల మధ్య పోరుగా ఉన్న పరిస్థితులు కాళేశ్వరం కమిషన్ నోటీసుల విషయంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ అన్నట్లు మారాయి. ఇక్కడ పార్టీలు కలవకపోయినా.. రెండు పార్టీల నేతలు మాత్రం ఈ విషయంలో కలిసి కట్టుగా ఒకే విధమైన విమర్శనాస్త్రాలను రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై సంధిస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై కమిషన్ ఇటీవల విచారణ పూర్తి చేసుకుంది. కాగా ఇందులో ఇప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌ను విచారించలేదు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అది జరిగిన 24 గంటల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు కమిషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ముగ్గురు విచారణకు హాజరు కావాలని కోరుతూ వారికి తేదీలను వెల్లడించాయా నోటీసులు. ఈ క్రమంలోనే తాజాగా ఈ నోటీసులపై ఈటల రాజేందర్, కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పాలన చేతకాక నోటీసు డ్రామాలు: కేటీఆర్
‘‘ఈ రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు. సీఎం రేవంత్ రెడ్డి ని అడుగుతున్నా. SLBC టన్నెల్ కూలింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టే తెలివి కూడా లేకపోయింది. మీ కమిషన్‌ల అరాటంతో మృతదేహాలను వెలికితీయడానికి సైతం సాహసం చేయలేకపోయారు. అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ చెప్ప లేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నల్గొండలో సుంకిషాల ప్రాజెక్ట్ కూలింది, ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల సమస్యలపై కాకుండా పచ్చినాటకంపై దృష్టి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని బలిగొడుతున్నారు’’ అని అన్నారు. ‘‘ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. నిజాయితీ ఎప్పటికీ ఓడిపోదు. మీరు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. తులం బంగారం ఏమైంది? 4 వేల రూపాయల పింఛన్లు ఏమయ్యాయి? మీరు ఎంత నోటీసులు ఇచ్చినా అవి దూది పింజల్లా ఎగిరిపోతాయి. మీవి అన్ని చిల్లర ప్రయత్నాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించనున్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయి’’ అని వ్యాఖ్యానించారు. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారన్నారని వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చూపించే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూది పింజలు లాగా తేలిపోతాయన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద తమకు అపార గౌరవం ఉందన్న కేటీఆర్, ముమ్మాటికి ధర్మం గెలుస్తుందన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడుతాడన్న నమ్మకం ఉందన్నారు.
కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారు: ఈటల
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నారన్నారు. అంతేకాకుండా తనకు నోటీసులు ఇంకా అందలేదని, నోటీసుల విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. వీటిపై పార్టీ అధిష్టానంతో చర్చించి హైకమాండ్ నిర్ణయానుగుణంగా ముందుకు వెళ్తామన్నారు. ఈ సందర్భంగానే ఆయన సీఎం రేవంత్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ‘‘ప్రభుత్వం నీది.. నువ్వు ఎలాంటి విచారణ అయినా చేయి’’ అని అన్నారు. ‘‘గతంలో దేవరాయాంజాల్ భూముల విషయంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు నువ్వూ చేస్తున్నావ్ రేవంత్. నువ్వు బెదిరిస్తే భయపడం. కేంద్రంలో మా పార్టీనే అధికారంలో ఉంది. నీ చిట్టా అంతా మా చేతిలో ఉంది. నీ దిక్కుమాలిన, చిన్న గాళ్లతో మాట్లాడితే నేను వెనక్కి పోను’’ అంటూ ఈటల వార్నింగ్ ఇచ్చారు. ‘‘విచారణ కమిషన్ గడువు ఇన్ని సార్లు ఎందుకు పొడిగించారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణా రావు, కడియం శ్రీహరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు, వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ? నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఆ శాఖకు కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు నేడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు’’ అని ఈటల పేర్కొన్నారు.