గాంధీలో గడువు ముగిసిన వ్యాక్సిన్,వైద్యులపై చర్యకు హెచ్చార్సీ సిఫార్సు
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సంచలన తీర్పు;
By : Saleem Shaik
Update: 2025-07-17 13:07 GMT
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు గడువు ముగిసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్‌లను నిర్లక్ష్యంగా ఇవ్వడంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి గడువు ముగిసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్లు ఇచ్చారని రోగులు ఏ ఎన్ ఆదిలక్ష్మీ, ఎస్ దేవమణి, టీ సతీష్, పి మల్లికార్జున్, టీ రవి, జి ధనుంజయ్ లు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. 2014వ సంవత్సరంలో 16 మంది రోగులకు గడువు ముగిసిన హెపటైటిస్-బి వ్యాక్సిన్లు ఇవ్వగా, వారిలో ఆరుగురు ఇచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్ పర్సన్ జస్టిస్ షమీమ్ అక్థర్ గురువారం సంచలన తీర్పు ఇచ్చారు.
అసలు కేసు ఏమిటంటే...
గాంధీ ఆసుపత్రిలోని ఓపీ బ్లాకులో రోగులకు వైద్యులు గడువు తీరిన వ్యాక్సిన్ వేశారు.డాక్టర్ వి తారాదేవి అనే రీసెర్చ్ ఫెలో కాలం చెల్లిన హెపటైటిస్ -బి వ్యాక్సిన్ రోగులకు వేశారు. నిర్లక్ష్యంగా కాలం చెల్లిన వ్యాక్సిన్ వేశారని,దీనివల్ల తాము మానసికంగా వేదనకు గురయ్యామని, దీనివల్ల కడుపు నొప్పి, కళ్లు తిరగడం, కడుపునొప్పి బాధలు పడ్డామని, అందువల్ల దీనికి కారణమైన డాక్టర్ వి తారాదేవిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని తెలంగాణ హెచ్చార్సీని రోగులు కోరారు. దీనిపై హెచ్చార్సీ 2014 సెప్టెంబరు 16వతేదీన గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను నివేదిక కోరగా పంపించారు.
నివేదికలో ఏ ముందంటే...
హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్యాక్ లో రెండు వేర్వేరు ఎక్స్ పైరీ డేట్స్ ఉన్నాయని డాక్టర్ వి తారాదేవి సరిగా చూడకుండానే కాలం చెల్లిన వ్యాక్సిన్ వేశారని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తన నివేదికలో తెలిపారు. ఎక్స్ పైరీ తేదీ చూడకుండా నిర్లక్ష్యంగా డాక్టర్ వ్యాక్సిన్ వేశారని తేల్చారు. గాంధీ ఆసుపత్రిలో మందుల సరఫరాలోనూ అక్రమాలు జరిగాయని పత్రికల్లో వచ్చిన వార్తలను హెచ్చార్సీ విచారించింది.
డాక్టరుపై సస్పెన్షన్ వేటు
కాలం చెల్లిన వ్యాక్సిన్ వేయడంపై నార్త్ జోన్ డీసీపీ, హెచ్చార్సీ డిప్యూటీ రిజిష్ట్రార్ సందర్శించి నివేదిక ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ వి తారావేదిను సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కూా బాధ్యుడని తేల్చారు.
హెచ్చార్సీ విచారణ
కాలం చెల్లిన వ్యాక్సిన్ వేసిన కేసులో బాధితులు ఫిర్యాదు (HRC No.3464/2014) చేయడంతో (HRC No.4350/2015)నంబరుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ విచారణ నిర్వహించి, గురువారం తుది ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సంఘటన బాధితుల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన మౌలిక హక్కులను తీవ్రంగా ఉల్లంఘించిందని కమిషన్ అభిప్రాయపడింది. వ్యవస్థాగత లోపాలను గుర్తించి, ఆసుపత్రి సూపరిండెంట్‌తో పాటు బాధ్యత వహించవలసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.
బాధితులకు నష్టపరిహారం
మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 లో తెలిపిన సెక్షన్ 18(ఎ)(ఐ) ప్రకారం ఈ కేసులో ప్రతి బాధితునికి రూ.1,25,000ల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని, మందుల సేకరణ , నిర్వహణ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మానవ హక్కుల కమిషన్ సూచించింది.ఈ సిఫార్సులు రెండు నెలల్లోపు అమలు చేయాలని కమిషన్ ఆదేశించింది.