ఆత్మహత్యకు అనుమతి అడిగిన దంపతులు
ఎస్ఐ వేధింపులతో బాగా విసిగిపోయాము కాబట్టి తమకు ఆత్మహత్య చేసుకోవటం ఒకటే మార్గమని ఫిర్యాదులో స్పష్టంచేశారు;
భూపాలపల్లిలోని రైతుదంపతులు ఆత్మహత్య చేసుకునేందుకు తమను అనుమతించాలని జిల్లా కలెక్టర్ ను పర్మిషన్ అడగటం సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొగుళ్ళపల్లి మండలంలోని వేములపల్లి గ్రామంలో సులోచన, ప్రతాప్ రెడ్డి రైతు దంపతులకు 12 ఎకరాల భూముంది. అయితే మూడేళ్ళుగా తమ పొలంలో వ్యవసాయం చేసుకోవటానికి అడ్డంకులు వస్తున్నాయి. అడ్డంకులు ఏమిటయ్యా అంటే ములుగు జిల్లా(Mulugu District)లోని కన్నాయిగూడెం ఎస్ఐ ఇనిగాల వెంకటేష్ తన సోదరుడు, తండ్రితో కలిసి రైతు దంపతులను బాగా ఇబ్బంది పెడుతున్నాడట. రైతుల పొలంమీద వీళ్ళ కన్నుపడిందో ఏమోగాని దంపతులను తమ పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేందుకు లేకుండా పొలానికి ఉన్న దారిని అడ్డుకున్నాడట. అంటే రైతు దంపతులను పొలంలోకి అడుగుపెట్టనీయకుండా ఎస్ఐ అడ్డుకుంటున్నాడు.
స్ధానికంగా ఎంతమందికి ఫిర్యాదులు చేసినా ఉపయోగం కనబడకపోవటంతో ఇదేవిషయాన్ని రైతుదంపతులు హైదరాబాద్ వచ్చి ప్రజావాణి(Prajavani Programme) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. వచ్చిన ఫిర్యాదు ప్రకారం భూపాలపల్లి ఆర్డీవో(Bhupalapalli RDO) రమాదేవిని విచారణ చేయమని హైదరాబాద్(Hyderabad) నుండి ఆదేశాలు వెళ్ళాయి. ఆదేశాలు అందగానే ఆర్డీవో మొగుళ్ళపల్లి గ్రామానికి వచ్చి క్షేత్రస్ధాయిలో విచారణ చేశారు. రైతుదంపతుల ఫిర్యాదు నిజమే అని విచారణ రిపోర్టు కూడా పై అధికారులకు పంపించారు. వ్యవసాయం చేసుకోనీయకుండా రైతు దంపతులను ఎస్ఐ బాగా ఇబ్బంది పెడుతున్నట్లు ఆర్డీవో రిపోర్టులో నిర్ధారించారు. ఎస్ఐ అధికార దుర్వినియోగం గురించి ఆర్డీవో రిపోర్టులో చెప్పినా పెద్దగా ఉపయోగం కనబడలేదు. ఉపయోగం కనబడకపోగా రైతు దంపతులపై ఎస్ఐ వేధింపులు మరింతగా పెరిగిపోయాయి. రైతు దంపతులపైనే కాకుండా వాళ్ళ బంధువులపైన కూడా ఎస్ఐ కేసులు పెట్టి బాగా ఇబ్బందులు పెడుతున్నాడు.
దాంతో రెవిన్యు అధికారులు, పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఉపయోగంలేకపోవటంతో చివరకు వేరేదారిలేక భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసుకు చేరుకున్నారు. తమపైన నమోదైన కేసులు, ఎస్ఐ వేధింపులను ఫిర్యదులో వివరించారు. ఎస్ఐ వేధింపులతో బాగా విసిగిపోయాము కాబట్టి తమకు ఆత్మహత్య చేసుకోవటం ఒకటే మార్గమని ఫిర్యాదులో స్పష్టంచేశారు. ఆత్మహత్య చేసుకునేందుకు తమను అనుమతించాలని రైతు దంపతులు కలెక్టర్ కు విజ్ఞప్తిచేసుకున్నారు. అయితే కలెక్టర్ ఆఫీసులో అధికారులు రైతు పరిస్దితిని అర్ధంచేసుకుని ఆత్మహత్య తప్పని వారించారు. కలెక్టర్ ఊరిలో లేరు కాబట్టి రైతు దంపతులను ఆర్డీవో రవి దగ్గరకు సమస్య పరిష్కారం నిమ్మితం పంపించారు. దంపతులతో మాట్లాడిన ఆర్డీవో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మరి వీళ్ళ సమస్యను ఆర్డీవోనే స్వయంగా పరిష్కరిస్తారో లేకపోతే కలెక్టర్ ఊరినుండి తిరిగొచ్చిన తర్వాత విషయం వివరించి సమస్య పరిష్కారానికి చొరవచూపిస్తారో చూడాల్సిందే.