అభ్యర్ధుల తలరాతను రైతులే డిసైడ్ చేస్తారా ?

మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలాగున్నా నల్గొండ పార్లమెంటు సీటులో మాత్రం అభ్యర్ధుల తలరాతను రాసేది మాత్రం రైతులనే చెప్పాలి.

Update: 2024-04-25 08:03 GMT
Nalgonda LS candidates

మిగిలిన పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలుపోటములు ఎలాగున్నా నల్గొండ పార్లమెంటు సీటులో మాత్రం అభ్యర్ధుల తలరాతను రాసేది మాత్రం రైతులనే చెప్పాలి. ఎందుకంటే పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లలో అత్యధికం రైతులు, రైతు కుటుంబాలే కాబట్టి. నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఏఎంఆర్పీ ప్రాజెక్టులున్నాయి. అలాగే కొంత ఆయకట్టు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలో కూడా ఉంది. ఇవికాకుండా మెట్టప్రాంతంలో ఉండే నియోజకవర్గాల్లో కూడా రైతులు, వ్యవసాయ సంబంధీకులు, వారి కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా వరిసాగు తర్వాత బత్తాయి లాంటి వాణిజ్యపంటల మీద ఆధారపడ్డ రైతులే ఎక్కువగా ఉన్నారు. సామాజికవర్గాలు ఏవైనా మొదటి ప్రాధాన్యత వ్యవసాయ ఆధారిత కుటుంబాలే అయ్యుంటాయి. అందుకనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధానంగా రైతాంగం ఓట్లపైనే దృష్టిపెట్టాయి.

1952 నుండి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, సీపీఐ చెరి ఏడుసార్లు గెలిచాయి. తెలంగాణా ప్రజాసమితి ఒకసారి, టీడీపీ రెండుసార్లు గెలిచింది. బీఆర్ఎస్, బీజేపీ ఈ నియోజకవర్గంలో బోణియే కొట్టలేదు. కాంగ్రెస్ తరపున కుందూరు రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా కంచర్ల కృష్ణారెడ్డి, బీజేపీ తరపున శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. రఘువీర్ రెడ్డి బలమంతా తండ్రి, సీనియర్ నేత కందూరు జానారెడ్డి, పార్టీ అధికారంలో ఉండటం. బీజేపీ అభ్యర్ధి సైదిరెడ్డి బలం హుజూర్ నగర్ మాజీ ఎంఎల్ఏ అవటంతో పాటు పార్లమెంటు పరిధిలో కొంతపట్టుండటం, నరేంద్రమోడి ఇమేజి. అలాగే కారుపార్టీ అభ్యర్ధి కృష్ణారెడ్డి సోదరుడు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మాజీ ఎంఎల్ఏ అవటమే బలం. అయితే భూపాల్ రెడ్డే సోదరుడికోసం పెద్దగా ప్రచారం చేయటంలేదని సమాచారం. అందుకనే మిగిలిన ఇద్దరితో పోల్చితే కృష్ణారెడ్డి వెనకబడిపోయారని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఏమిటంటే పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీల్లో నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ ఎంఎల్ఏలే ఉన్నారు. అలాగే సూర్యాపేటలో బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఉన్నారు. అభ్యర్ధుల గెలుపోటములు రైతులచేతిలోనే ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రధానంగా రైతాంగసమస్యలపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ధాన్యానికి మద్దతుధర ఇస్తామని, వచ్చే సీజన్ నుండి వరికి రు. 500 బోనస్ ఇస్తామని, ఆగస్టు 15వ తేదీకి రైతురుణాలన్నీ మాఫీచేస్తానని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ సొరంగమార్గానికి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిధులు కేటాయించి పనుల్లో స్పీడు పెంచిందని చెబుతున్నారు. దిండి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టును కూడా పూర్తిచేస్తామని, బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ను కూడా పూర్తిచేస్తామని రేవంత్ హామీలిస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ అయితే తమ హయాంలో కొనుగోలుచేసిన ధాన్యం గురించి ప్రచారం చేసుకుంటోంది. తమ హయాంలో రైతులకు జరిగిన మేలును బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణారెడ్డి వివరిస్తున్నారు. అలాగే పంటలకు గిట్టుబాటు ధర వచ్చేట్లుగా నల్గొండలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేస్తామని బీజేపీ అభ్యర్ధి సైదిరెడ్డి హామీ ఇస్తున్నారు. అభ్యర్ధుల గెలుపుకోసం ఇప్పటికే రేవంత్ మూడుసార్లు పర్యటిస్తే, కేసీయార్ రెండుసార్లు ప్రచారంచేశారు. పార్లమెంటు నియోజకవర్గంలో అనేక సామాజికవర్గాలు ఉన్నప్పటికీ ప్రధానంగా లంబాడాలు, యాదవులు, ఎస్సీలదే మెజారిటి. లంబాడాలు ఎక్కువగా దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్లో కేంద్రీకృతమైవున్నారు. మైనారిటీలతో పాటు బీసీల్లోని పద్మశాలీ, మున్నూరుకాపు, ముదిరాజుల ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి.

Tags:    

Similar News