కార్మికుల వేతనాల పెంపుపై ఫిల్మ్ ఫెడరేషన్ కు ఫిల్మ్ క్లబ్ లేఖ

కొలిక్కి వస్తున్న చర్చలు..రేపు ఫెఢరేషన్ కార్యాచరణ;

Update: 2025-08-17 13:36 GMT

సినీ కార్మికులకు , నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నాయి. ఫిల్మ్ ఫెడరేషన్ కు ఫిల్మ్ చాంబర్ ఓ లేఖ రాసింది. ఈ లేఖలో ప్రధానంగా నాలుగు డిమాండ్లను ఫిల్మ్ క్లబ్ ప్రస్తావించింది.చర్చలు ఫలించకపోవడంతో సినీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో షూటింగ్ లు నిల్చిపోయిన సంగతి తెలిసిందే.

ఆదివారం లేఖలో ఫిల్మ్ ఛాంబర్ పంపిన ష‌ర‌తులు ఇలా ఉన్నాయి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షీట్ గా పరిగణించాలి. అంటే 12 గంటల పనిని ఒక కాల్ షీట్‌గా పరిగణించాలని పేర్కొంది. అలాగే రెండో ఆదివారం మాత్రమే రెట్టింపు జీతం చెల్లించాలి. ఆ రోజు కార్మిక శాఖ సెలవు దినం ప్రకటిస్తే మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించాలి. జనరల్ కండిషన్స్ క్లాజ్ 1 ప్రకారం, తమ సినిమా కోసం స్కిల్ ఉన్న టెక్నీషియన్ ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ప్రొడ్యూసర్ కు ఉండాలి. ఈ షరతులను సంపూర్ణంగా ఆమోదిస్తే, కార్మికుల వేతనాలను పెంచడానికి నిర్మాతలు సిద్ధం అని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.

ఫిల్మ్ క్లబ్ , ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు మెగా స్టార్ చిరంజీవితో వేర్వేరుగా సమావేశమైనట్టు తెలుస్తోంది. రేపు ఫెడరేషన్ సభ్యులు మరో దఫా చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.

రోజుకు రూ. 2000 లేదా అంతకంటే తక్కువ సంపాదించే కార్మికుల వేతనాలు పెంపుకు ఫిల్మ్ క్లబ్ కండిషన్ పెట్టింది. మొదటి సంవత్సరం 10 శాతం, తర్వాతి రెండు సంవత్సరాలకు అదనంగా 5 శాతం చొప్పున వేతనాలు పెంచడానికి నిర్మాత‌లు నిర్ణయించారు. అలాగే రోజుకు రూ. 2000 నుంచి రూ. 5000 మధ్య సంపాదించే కార్మికులకు నిబంధనలను కఠినతరం చేసింది. మూడు సంవత్సరాల పాటు 5 శాతం చొప్పున వేతన పెంపుకు ఫిల్మ్ క్లబ్ అంగీకారం తెలిపింది. అయితే, లో బడ్జెట్ చిత్రాలకు మాత్రం ఈ వేతన పెంపు అస్సలు వర్తించదు. ఆ సినిమాలకు ప్రస్తుత వేతనాలే అమల్లో వస్తాయి. ఈ ప్రతిపాదనలపై ఫిల్మ్ ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే సినిమా పరిశ్రమలో వేతనాల పెంపు స్పష్టత రాబోతుంది.ఫెడరేషన్ రేపు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది.

Tags:    

Similar News