గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో ప్రమాద హెచ్చరిక

లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు;

Update: 2025-08-31 10:16 GMT

కేవలం పది రోజుల వ్యవధిలో గోదావరి నీటిమట్టం క్రమేపి పెరుగుతోంది. అధికారులు తాజాగా ఆదివారం గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారి చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు, రాష్ట్రంలో కురుస్తున్నభారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నంగోదావరి 48 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

నీటిమట్టం వేగంగా పెరగడంతో ఇప్పటికే చాలా మండలాలకు రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద వరద నీరు చేరుతోంది. ఈ మార్గంలో వెళ్లే వాహనదారుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గోదావరి దిగువ ప్రాంతంలో ముంపు మండలాలు ఉన్నాయి. ఈ మార్గంకు వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు వచ్చి చేరుతోంది. వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలు గత రెండు రోజుల నుంచి జలదిగ్బంధంలోనే చిక్కుక్కున్నాయి.

గోదావరి నీటిమట్టం ఉధృతి పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. గోదావరి ఉదృతంగా ప్రవహించడంతో కళ్యాణ కట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరుకుంది. నీటిమట్టం పెరగడంతో భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.గోదావరి ఒడ్డున ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లు, లాంచీలు, పడవలను సిద్ధంగా ఉంచారు. గణేశ్​ నిమజ్జనానికి వెళ్లే భక్తులు సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడ్డున ఏర్పాటు చేసిన కొళాయిల వద్ద స్నానాలు ఆచరించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 30న సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి ఒక రోజు వ్యవధిలో రెండో ప్రమాద హెచ్చరిక జారి చేయడంతో అధికారులు అప్రమత్తమై నదిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మహరాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరికి వరద పోటెత్తింది. అక్కడ వర్షాలు తగ్గుముఖం పడితే వరద ప్రవాహం నిలకడగా ఉండే అవకాశాలున్నాయని అధికారులు అంచనావేస్తున్నారు.నిన్న రాత్రి 12 గంటలకు 47.5 అడుగులతో గోదావరి నీటిమట్టం ప్రవహించింది. ఈ నేపథ్యంలో భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, మణుగూరు మండలాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వరద నీటితో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ నివసించే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జలదిగ్బంధంలో ఏడుపాయల అమ్మవారు

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుక్కుంది.గత 18 రోజులుగా ఇదే పరిస్థితి. సింగూరు జలాశయం నుంచి మంజీరా నదీపాయ నిజాంసాగర్ వైపు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏడుపాయల దుర్గమ్మ దేవాలయ అర్చకులు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ఎదురు నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

Tags:    

Similar News