గుల్జార్‌హౌస్ ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణ,ఏసీ కంప్రెషర్ పేలుడే కారణం

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై క్లూస్ ,ఫోరెన్సిక్ టీం విచారణ మంగళవారం ముగిసింది. ఏసీల్లోని కంప్రెషర్ పేలుడు వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడైంది.;

Update: 2025-05-20 13:50 GMT
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై క్లూస్ ,ఫోరెన్సిక్ టీం విచారణ మంగళవారం ముగిసింది. ఏసీల్లోని కంప్రెషర్ పేలుడు వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడైంది. ప్రమాదం జరిగిన తర్వాత క్లూస్ ఫోరెన్సిక్ టీం అధికారులు లోపలికి వెళ్లి విచారణ జరిపారు. గుల్జార్ హౌసులో అగ్ని ప్రమాద కారణాలపై అధికారులు ఏసీ కంప్రెషర్ పేలుడు కారణమని నిర్ధారణకు వచ్చారు.ఇంటి మొత్తంలో 14 ఏసీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఏసీ కంప్రెషరు పేలడంతో గ్రౌండ్ ప్లస్ టు అంతస్తుల భవనం మొత్తం తునా తునకలు అయింది.


మూడు అంతస్తుల భవనంలో వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి.గోడలు మొత్తం పగుళ్లు వచ్చినట్లు గుర్తించారు. మంటల వేడి వల్ల భవనం మొత్తం పగుళ్లు ఏర్పడింది.ఫ్లోర్ లో ఉన్న టైల్స్ ,మార్బుల్స్ మొత్తం కూడా ముక్కలయ్యాయి.భవన నిర్మాణంలో నాణ్యతపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.గుల్జార్ హౌస్ ప్రమాదం పై విచారణకు ఇప్పటికే ప్రభుత్వం హై లెవెల్ కమిటీని నియమించింది.


బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సందర్శన
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద స్థలాన్ని మంగళవారం సందర్శించారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్, సభ్యులు మంగళవారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపాన్ని తెలిపారు. ఈ సంఘటన తీవ్ర బాధాకరమని సీతా దయాకర్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో అమాయక పిల్లలు మరణించారని చెప్పారు.భవిష్యత్తులో పిల్లల రక్షణ కోసం ఇటువంటి అగ్ని ప్రమాదాలను నివారించడానికి నివారణ విధానాలను అమలు చేయాలని చైర్‌పర్సన్ నొక్కి చెప్పారు. పిల్లల హక్కులు, శ్రేయస్సును కాపాడటానికి కమిషన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.ఈ కార్యక్రమంలో సీతా దయాకర్ రెడ్డితో పాటు, కమిషన్ సభ్యులు కంచెర్ల వందన గౌడ్, మరిపల్లి చందన, బి. అపర్ణ, గోగుల సరిత, ప్రేమలత అగర్వాల్ మరియు బి.వచన్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.


Tags:    

Similar News