గరికపాటిని ఉతికి ఆరేసిన తొలి భార్య, దమ్ముంటే వివరణ ఇమ్మని సవాల్
తన కుమారుడికి మహాకవి శ్రీ.శ్రీ. పేరు పెట్టుకున్న గరికపాటికి "మీ మీ వ్యక్తిగత బతుకులు మీమీ ఇష్టం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం" అనే మాట గుర్తుకు రాలేదా?;
By : The Federal
Update: 2025-01-08 02:25 GMT
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (GARIKAPATI NARASIMHA RAO) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కే గరికపాటిపై ఈసారి ఏకంగా ఆయన తొలి భార్య కామేశ్వరి (KAMESWARI) సంచలన ఆరోపణలు చేశారు. దీంతో గత 9 నెలలుగా కామేశ్వరీ, గరికపాటి నరసింహారావు మధ్య సాగుతున్న 'ప్రచ్ఛన్న యుద్ధం' ఇప్పుడు బట్టబయలైంది. గరికపాటిని కామేశ్వరి నోరు పట్టరాని మాటలన్నారు. ఈమేరకు ఆమె విడుదల చేసిన సుదీర్ఘ వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు నోరు విప్పని గరికపాటి బృందం తాజాగా ఆమె చేసిన ఆరోపణలను ఖండించింది. గరికపాటి పేరు ప్రతిష్టలను మసకబార్చేలా కొందరు కుట్ర చేస్తున్నారని, అందులో కామేశ్వరి పావుగా మారారని తిప్పికొట్టారు.
ఎవరీ గరికపాటి, ఏమా కథ?
పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం ఆయన స్వగ్రామం. 1958 సెప్టెంబర్ 14న జన్మించారు. వేంకట సూర్యనారాయణ, వేంకట రమణమ్మ తల్లిదండ్రులు. అష్టకష్టాలు పడి చదువుకున్నారు. అద్భుతమైన ధారణ శక్తి ఆయన సొంతం. ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు. 30 ఏళ్లు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య కామేశ్వరీ. ఆమె కూడా తెలుగు, సంస్కృత పండితురాలే. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయారు. ఆ పిల్లలకు మహాకవులైన గురజాడ, శ్రీశ్రీ పేర్లు పెట్టారు. ఆ పిల్లలకు 10,12 ఏళ్ల వయసున్నప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు శారద. హైదరాబాదులో స్థిరపడడానికి ముందు కాకినాడలో కూడా ఉన్నారు. మొదటి భార్య కామేశ్వరి కూడా మూడు ఎం.ఎ.లు చేసి సంస్కృత అధ్యాపకురాలిగా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు.
గరికిపాటి నరసింహారావు మంచి అవధాని, ఉపన్యాసకుడు, రచయిత కూడా. దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. ఇప్పటి వరకు 275 అష్టావధానాలు, ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన్ను పిలవని టెలివిజన్ ఛానల్ లేదు, ఆయనతో ప్రవచనం చెప్పించుకోని మహాసంస్థలు, ప్రముకులు లేరంటే అతిశయోక్తి కాదు. పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి 14 పుస్తకాలు రాశారు. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు లాంటి పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. 2022లో ఆనాటి రాష్ట్రపతి రామ్ నాథ్ గోవింద్ నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.
గరికపాటికి వివాదాలు కొత్త కాదు...
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల కొండలెన్ని అనే దానిపై వివాదం చెలరేగింది. ఏడు కొండలు కాదు ఐదు కొండలే అన్నవాళ్లు ఏమైయిపోయారో తెలుసాగా అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలతో దుమారం చెలరేగింది. బంగారం తయారు చేసేటపుడు కాస్తైనా బంగారాన్ని స్వర్ణకారులు దాస్తుంటారని, వాళ్లు దోపిడీదారులనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. దీనిపై స్వర్ణకారులు ఆయన ఇంటిని చుట్టుముట్టి ఆందోళన చేయడంతో క్షమాపణలు చెప్పారు. నటి శ్రీదేవి మరణంపైనా, పిల్లల్ని స్కూళ్లలో టీచర్లు కొట్టడంపైన కూడా గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసి ఆ తర్వాత నాలుకకరుచుకున్నారు. తన తోటి ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అజ్ఞాని అంటూ ఓ సందర్భంలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రముఖ నాయకుడు బండారు దత్తాత్రేయ ప్రతిఏటా నిర్వహించే అలాయ్ బలాయ్ లో మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీలు దిగే కార్యక్రమాన్ని ఆపేయకపోతే తాను వేదిక దిగిపోతానంటూ బెదిరించడం, దీనికి చిరంజీవి అభిమానులు ఆయన్ను పెద్దఎత్తున ట్రోల్ చేయడం, హెచ్చరికలు చేయడంతో చిరంజీవికి క్షమాపణ చెప్పారు.
తొలి భార్య కామేశ్వరి మండిపాటు..
గరికపాటి నరసింహారావు తొలి భార్య కామేశ్వరి ఇప్పుడు గరికపాటిని నోరు పట్టరాని మాటలంటున్నారు. "ఆ నీచుడు".."నికృష్టుడు".. "దుర్మార్గుడు".. "అహంభావి".. "అహంకారి".. "ఆ నీచుని పేరు నేను ఎత్తను" అంటూనే గరికపాటిని అనరాని మాటలన్నారు. తాము ఒకే ఊరివాళ్లమని, తాను గరికపాటి కన్నా రెండేళ్లు పెద్దని, అతని గతం తనకు బాగా తెలుసునని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీసుకువచ్చారని, లేని పెళ్లికి గరికపాటి సోదరుడొకరు తనను గదిలో బంధించి బలవంతంగా తెల్లకాగితాలపై సంతకాలు చేయించి విడాకులన్నారని ఆమె ఆరోపించారు. తన మానాన తాను వీడియోలు చేసుకుంటూ బతుకుతుంటే తన పెద్ద కుమారుడితో తనపై పది నెలల కిందట క్రిమినల్ కేసు పెట్టించారని కామేశ్వరి తన వీడియోలో ఆరోపించారు. 40 ఏళ్లుగా తాను పడిన, పడుతున్న క్షోభను వివరించారు. కలియుగంలోనే దుర్మార్గమైనటు వంటి వ్యక్తి గరికపాటి అంటూ మండిపడ్డారు.
వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటీ?
కామేశ్వరి కొంతకాలం కిందట వాలీ, సుగ్రీవులు, వారి భార్యలు, వారి సంబంధాలు, అన్నాదమ్ముల వివాదం, చేసుకున్న ద్రోహాలు వంటి వాటిని వివరిస్తూ ఆమె వీడియో చేశారు. అది గరికపాటిని ఉద్దేశించి ఆమె చేశారంటూ కొంతకాలం ప్రచారం నడుస్తోంది. ఆ వీడియోను తీసివేయమని గరికపాటి టీమ్ ఆమెను కోరినట్టు, ఆమె తిరస్కరించినట్టు ఇప్పుడు విడుదల చేసిన వీడియోను బట్టి తెలుస్తోంది. పురాణాలు, ఇతిహాసాలు, బంధాలు, బాంధవ్యాలు, భార్యాభర్తలు ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి?, స్త్రీలు తనకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలంటూ గరికపాటి పదేపదే చెబుతుంటారని, అందుకే నేను నా గతాన్ని బయటపెట్టానని కామేశ్వరి చెబుతున్నారు. కుటుంబం ఎలా ఉండాలి? అని సుద్దులు చెప్పే మహానుభావుడైన గరికపాటి తనను ఇంటి నుంచి ఎలా తరిమేశాడని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన తప్పుల్ని ప్రశ్నించినందుకు తన కన్నబిడ్డ (పెద్ద కుమారుడు గురజాడ)తో పది నెలల కిందట కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు. ఆనాడు అదేమిటని ప్రశ్నించని చాలా మంది గరికపాటి నరసింహారావు భజనబృందం ఇప్పుడు తనను ఆక్షేపించడంలో అర్థం లేదని ఆమె తెగేసి చెబుతున్నారు. తనను రెచ్చగొడితే మరిన్ని వివరాలు బయటపెడతానని హెచ్చరిస్తున్నారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీ నోరు విప్పితే ఏమవుతుందో తనకు బాగానే అవగాహన ఉందని కూడా ఆమె చెబుతున్నారు.
చిన్నప్పుడే లాక్కొచ్చి దండేశాడు...
"గరికపాటి అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి చిన్నతనంలోనే నన్ను లాకొచ్చి మెడలో దండ వేసి పెళ్లి, పెళ్లాం అన్నాడు. మంచి భర్త, ఇద్దరు పిల్లలను ఇవ్వమని దేవుడిని అడిగితే పిల్లలను ఇచ్చాడు. కానీ, భర్త..నరకం చూపించాడు. 25 ఏళ్ళు.. నేను వాడిని భరించలేకపోయాను. ఉద్యోగం లేదు.. డబ్బు లేదు. ఉన్న ఇంటిని తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకుని రాయించుకున్న దుష్టుడు. ఇంత చూశాక పిల్లల భవిష్యత్తు గురించి అలోచించి నేను బయటకు వచ్చా. ఆ తరువాత వేరొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శారద. ఉత్తమురాలు. నా పిల్లలను మంచిగానే పెంచారు. పెళ్లి చేశారు. వాళ్లిద్దరూ ఇప్పుడు విదేశాల్లో స్థిరపడ్డారు. పిల్లల కోసమే ఇంతకాలం నేను నోరు తెరవలేదు. ఈమధ్య నేనేదో అంటే.. విడాకులు తీసుకొని ఎందుకు వచ్చావు, ఆయన ఆస్తి కోసమేనా అని కొందరు పండితులు అంటున్నారు. నేనేం ఒళ్ళు బలిసి రాలేదు. వారి ఫ్యూచర్ కోసం ఆలోచించి వచ్చాను. ఇప్పటికీ వారి గురించే ఆలోచిస్తూ బతుకుతున్నాను" అన్నారు కామేశ్వరీ.
నాకేమీ రాదా? 3 ఎం.ఎ.లు చేశా..
నాకేది రాదన్నాడు.. సంస్కృతం లో డిగ్రీ చేశా.. తెలుగులో చేశా.. లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యా. చిన్నతనం నుంచి నాకు తెలుసు వీడు (గరికపాటి). పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నవీడే.. తల్లి వరుసను కూనీ చేశాడు. తన భవిష్యత్తుకు అడ్డు వస్తున్నానని హింసించి నన్ను పంపించేశాడు. ఇప్పటివరకు నేను బయటకు రాలేదు. అసలు వచ్చేదాన్ని కూడా కాదు. కానీ , ఈ నీచుడు యూట్యూబ్ లలో మాట్లాడుతూ.. నేను శ్రీరాముడిని.. ఏ తప్పు చేయలేదు. మీకు అన్యాయం జరిగితే మాట్లాడాలి.. ఎదిరించాలి అని చెప్పుకొచ్చాడు. అది విన్నాక నాకు కూడా అనిపించింది.. నాకు అన్యాయం జరిగింది కదా అని అందుకే ఇప్పుడు బయటకు వచ్చాను. ప్రశ్నిస్తున్నాను.. అన్నారు కామేశ్వరి.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
నేనేదో నా మానాన వీడియోలు చేసుకుంటే.. నా కన్నకొడుకు చేతనే నాపై పోలీస్ కేసు పెట్టించాడు. పచ్చని సంసారం నాది. అతని అన్నను పెళ్లి చేసుకున్నాను. ఆ సంసారంలో చిచ్చుపెట్టి నాకు నరకం చూపించాడు.. ఇప్పుడు ఆయన డబ్బు కోసం నేను ఇదంతా చేస్తున్నాను అని అనుకుంటున్నారు. దానికి నేను రాలేదు” అంటూ ఆమె వీడియో చేసింది. అంతేకాకుండా తనను ప్రశ్నించే వారందర్నీ తన ఇంటికి వచ్చి తాను ఎలా బతుకుతున్నానో, తనకు ఎంత సంపద ఉందో కూడా చూడమని సవాల్ విసిరారు. ఇప్పుడా వీడియో వైరల్ అయింది. గరికపాటి నరసింహారావు పై ట్రోల్స్ ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి.
కదిలిన గరికపాటి టీమ్...
ఇదేదో చిన్న వ్యవహారమేలే అనుకున్న గరికపాటికి గట్టిగా సెగ తగిలింది. దీంతో ఆ వీడియోపై గరికపాటి టీమ్ స్పందించింది. "పద్మ శ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికిపాటి నరసింహారావుపై ఇటీవల కొందరు వ్యక్తులు, కొన్ని యుట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేసి పరువు తీస్తున్నారు. ఈ దుష్ప్రచారం, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను చాలా కలత పెడుతోంది. వారు చేసిన ఆరోపణలన్నీ నిరాధారం, సత్య దూరం. కొన్ని వేర్వేరు సంఘటనల్లో గురువుగారు ఎవరెవరికో చెప్పని క్షమాపణలు కూడా చెప్పారని, అయినా వారి గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వారి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా నిరాధార, అసత్య ప్రచారం జరుగుతోంది. వీటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటివరకు వారిపై తప్పుడు ప్రచారం చేసిన యుట్యూబ్ ఛానెల్స్, సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేయడం జరుగుతుంది. కాబట్టి, ఈ విషయంలో వ్యక్తులు గానీ, సామాజిక మాధ్యమాలు గానీ ఇకపై ఎటువంటి దుష్ప్రచారం చేసినా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు” అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు.
"బజారుకెక్కింది, మీరా, మేమా"...
ఒకనాటి దంపతులైన గరికపాటి, కామేశ్వరీ తమ బతుకుల్ని బజారులో పెట్టుకుంటే మధ్యలో తమ తప్పేమిటని నెటిజన్లు, యూ ట్యూబ్ ఛానళ్లు ప్రశ్నిస్తున్నాయి. కామేశ్వరి చెప్పింది అసత్యమైతే ఆమెపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి బదులు తమను ఎలా బాధ్యుల్ని చేస్తారని యూట్యూబర్ పి.హరి ప్రశ్నించారు. కామేశ్వరి చెప్పిన మాటల్లో వాస్తవం ఉందో లేదో గరికపాటి నరసింహారావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన కుమారుడికి మహాకవి శ్రీ.శ్రీ. పేరు పెట్టుకున్న గరికపాటి... అదే శ్రీశ్రీ ఓ సందర్భంలో ఏమన్నారో మరో యూట్యూబర్ ఏ.అనిల్ రెడ్డి గుర్తు చేశారు. "మీ మీ వ్యక్తిగత బతుకులు మీమీ ఇష్టం, పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం, ఏదైనా చేస్తాం" అని అనిల్ గుర్తు చేశారు.