తెలంగాణ రైతులకు శుభవార్త, వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ

తెలంగాణలోని రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త వెల్లడించారు.రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సబ్సిడీపై అందించాలని మంత్రి నిర్ణయించారు.

Update: 2024-11-12 13:14 GMT

తెలంగాణలోని రైతుల కోసం జిల్లా స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.జిల్లాల వారీగా రైతుల డిమాండును బట్టి ఎంపిక చేసిన పనిముట్లు,యంత్రాలను సబ్సిడీపై అందించాలని నిర్ణయించారు.

- వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించడానికి కావాల్సిన నిధుల గురించి మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సహకార సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
- వ్యవసాయమంత్రి గారి ఆదేశాలతో ఈ యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి చెప్పారు.ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు డైరెక్టర్ వెల్లడించారు.

జిల్లాల్లో వ్యవసాయ పరికరాల ఎగ్జిబిషన్లు
మంత్రి తుమ్మల ఆదేశాలతో త్వరలోనే జిల్లాల వారీగా యంత్ర పరికరాలు,పనిముట్లు తయారీ దారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులలో అవగాహన పెంపొందించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. జిల్లా యంత్రాంగం ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నామని డైరెక్టర్ గోపి వివరించారు.

రైతులకు ఏ పరికరాలు అందిస్తారంటే...
ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎమ్.బి నాగళ్ళు, కల్టివేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేలర్స్, పవర్ వీడర్స్, మొక్కజొన్న వొలుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందించాలని ప్రతిపాదించినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు. గత 5 సంవత్సరాల నుండి, వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి, కేంద్ర ప్రభుత్వము తమ వాటా నిధులు విడుదల చేస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వము తమ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల చెప్పారు.

సోయాబిన్ సేకరణలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్
డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ జాయింట్ సెక్రటరీ శామ్యూల్ సోయాబీన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో, ఇప్పటిదాకా జరిగిన సోయాబిన్ సేకరణ గురించి సమీక్షించారు.ఈ సందర్భంగా శామ్యూల్ మాట్లాడుతూ, ఇప్పటిదాకా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 47 సెంటర్ల ద్వారా సోయా సేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇప్పటికి 118.64 కోట్ల విలువగల 24,252 మెట్రిక్ టన్నుల సోయా చిక్కుడును, 1464 మంది రైతుల నుంచి సేకరించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు.


Tags:    

Similar News