తెలంగాణలో నూతన వధూవరులకు సర్కారు శుభవార్త
తెలంగాణలో మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారా? అయితే మీరు మీ సేవలో కొత్తగా మ్యారేజ్ రెజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.;
By : The Federal
Update: 2025-06-30 12:55 GMT
మీ సేవలో కొత్తగా మ్యారేజ్ రెజిస్ట్రేషన్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయించింది. తెలంగాణ ఈ-గవర్నెన్స్‌కు ప్రతీకగా నిలిచిన మీ సేవ పౌరసౌకర్యాల విస్తరణలో మరో ముందడుగు వేసింది.రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికేట్ వంటి కొత్త సేవలను సోమవారం ఆవిష్కరించింది. వీటి కోసం స్లాట్ బుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
నూతన పౌర సేవల ప్రారంభం, మీ సేవ కార్యక్రమాల పనితీరును శ్రీధర్ బాబు సచివాలయంలో సోమవారం సమీక్షించారు.ఈ కొత్త సేవలు ప్రజలకు మరింత పారదర్శకతతో కూడిన, వేగవంతమైన సేవలుగా మారనున్నాయి. భూమి, అపార్టుమెంట్ విలువల అంచనాలను 24 గంటల్లోపు ఆమోదించేలా చర్యలు చేపడుతున్నారు. మ్యారేజ్ రెజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇకపై సమర్థవంతంగా జరుగనుంది.
మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
మీసేవలో నూతన వధూవరులు మ్యారేజీ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు పెళ్లి ఫొటోలు, చిరునామా రుజువు, వయస్సు ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఆమోదం అనంతరం సర్టిఫికెట్‌ను ప్రత్యక్షంగా సబ్-రెజిస్టార్ ఆఫీసు నుంచి జారీ చేస్తారు.
ఇక ఆన్ లైన్ సేవలు
ఈ సేవల ద్వారా ప్రజలు అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నిర్మాణ రంగం, స్థిరాస్తి కొనుగోళ్లు చేయాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడనుంది.మీ సేవ సెంటర్ లేదా ఆన్లైన్లో జిల్లా, గ్రామం వంటి వివరాలను సమర్పించి భూమికి సంబంధించిన తాజా మార్కెట్ విలువను పొందవచ్చు. ఈ దరఖాస్తులను సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం త్వరితగతిన పరిశీలించి నిర్ణయిస్తుంది.తాజా సేవలు అందుబాటులోకి తీసుకురావడం, రాష్ట్ర డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు. ఇప్పటికే మీ సేవలో ఆర్టీఏ, పాన్, ఇసుక బుకింగ్ వంటి సేవలు మిళితమయ్యాయి. ఇకపై టీ-ఫైబర్, అదనపు కియాస్క్‌లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.