చంద్రబాబుకు బ్రహ్మాండమైన స్వాగత ఏర్పాట్లు

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా హైదరాబాద్ లో అడుగుపెడుతున్న చంద్రబాబునాయుడుకు అపూర్వస్వాగతం పలికేందుకు తమ్ముళ్ళు పోటీలు పడుతున్నారు.

Update: 2024-07-05 09:28 GMT

ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా హైదరాబాద్ లో అడుగుపెడుతున్న చంద్రబాబునాయుడుకు అపూర్వస్వాగతం పలికేందుకు తమ్ముళ్ళు పోటీలు పడుతున్నారు. పార్టీ తరపున బ్రహ్మాండమైన స్వాగత ఏర్పాట్లు చేశారు. గడచిన ఐదేళ్ళల్లో చంద్రబాబు తరచూ హైదరాబాద్ కు వస్తునే ఉన్నారు. కొన్నిసార్లు రోజుల తరబడి హైదరాబాద్ లోని తన ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అదంతా ప్రతిపక్ష నేత హోదాలో.

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 175 సీట్లలో కూటమి 164 సీట్ల అఖండ విజయాన్ని సొంతంచేసుకున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాలుగుసార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు. అయితే హైదరాబాద్ రావటం మాత్రం ఇదే మొదటిసారి. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారు. అందుకనే మొదటిసారి సీఎం హోదాలో నగరానికి వస్తున్న తమ అధినేతను రిసీవ్ చేసుకునేందుకు తమ్ముళ్ళు ఘనమైన ఏర్పాట్లుచేశారు.




 బేగంపేట విమానాశ్రయం నుండి జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటివరకు రోడ్లకు రెండువైపులా పెద్దఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర భారీ ఎత్తున కటౌట్లు పెట్టారు. ట్రాఫిక్ ఐల్యాండ్లను పార్టీ జెండాలు, బ్యానర్లతో కప్పేశారు. రోడ్లకు రెండువైపులా ఉండే చెట్లకు కూడా పార్టీ జెండాలను కట్టారు. జూబ్లీహిల్స్ మొదట్లోని పార్టీ కార్యాలయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. రంగురంగుల దీపాలను వేలాడదీశారు. బేగంపేట ఎయిర్ పోర్టు దగ్గర నుండి ఇంటివరకు మధ్యలో ఉండే సుమారు 10 కిలోమీటర్లలోనూ పార్టీ క్యాడర్ పెద్దఎత్తున మోహరించబోతున్నారు. చంద్రబాబుకు జేజేలు కొట్టేందుకు క్యాడర్ తెలంగాణాలోని అన్నీ జిల్లాల నుండి ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమైన నేతలంతా ఇప్పటికే ట్రస్ట్ భవన్ లో సమావేశమయ్యారు. బేగంపేట టు జూబ్లిహిల్స్ చంద్రబాబు ఇంటివరకు వేలాది బైకులతో పెద్దఎత్తున ర్యాలీగా వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు, బతుకమ్మ, బోనాలు, డీజేలను కూడా ఎక్కడికక్కడ నేతలు సిద్ధంచేశారు.




 శుక్రవారం రాత్రి తనింట్లోనే చంద్రబాబు తమ్ముళ్ళతో భేటీ అవుతారు. అలాగే శనివారం ఉదయం విభజన సమస్యలపై రేవంత్ రెడ్డితో సమావేశం అవబోతున్నారు. ఆదివారం ఉదయం ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో తమ్ముళ్ళు, క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశం అవబోతున్నారు. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయటం, తొందరలోనే జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీచేయటం, సభ్యత్వ నమోదు లాంటి అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ట్రస్ట్ భవన్లోనే చంద్రబాబును ఘనంగా సత్కరించేందుకు తమ్ముళ్ళు భారీ ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News