రాహుల్ గల్ఫ్ సంక్షేమ హామీలివే : మంత్రికి తెలిపిన గల్ఫ్ యాక్టివిస్టులు

13 నెలల కిందట తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పర్యటనలో ఉన్నపుడు గల్ఫ్ బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారి సంక్షేమానికి అనేక హామీ లిచ్చారు.

Update: 2024-01-01 03:05 GMT
13 నెలల కిందట భారత్ జోడో యాత్ర సందర్భంగా గల్ఫ్ బాధిత కుటుంబాలతో రాహుల్ గాంధీ


గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారై పాలసీ రూపకల్పన గురించి రాబోయే  బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేయాలని గల్ఫ్ కార్మిక నాయకుల బృందం సచివాలయంలో మంత్రి డి. శ్రీధర్ బాబును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి మంత్రితో వివరంగా చర్చించారు. కేరళ, పంజాబ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన గల్ఫ్ సంక్షేమ పథకాలను అధ్యయనం చేయాలని సూచించారు. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషయా చెల్లింపుకు వెంటనే జీ.ఓ.విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 




 


రాహుల్ గాంధీని కలచి వేసి గల్ఫ్ బాధలు

13 నెలల క్రితం... భారత్ జోడో యాత్ర 60వ రోజు, నవంబర్ 6, 2022న మెదక్ జిల్లాలోని నిజాంపేట సమీపంలో, ఇద్దరు గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీని కలుసుకుని తమ బాధలను చెప్పుకున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన ముడ అశోక్ అనే గిరిజన వలస కార్మికుడు అబుదాబిలో మృతి చెందాడు. గల్ఫ్‌లో మరణించిన అశోక్‌ 10 నెలల కూతురు సాత్విక తన తల్లి మూడ లక్ష్మితో కలిసి రాహుల్‌ గాంధీని కలిశారు. పాప అమాయకపు చూపులు, గల్ఫ్ మృతుడి భార్య దీనస్థితిని చూసి దిగ్భ్రాంతి చెందిన రాహుల్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ను కోరారు.

 

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొండాపూర్‌కు చెందిన బచ్చల రాజనర్సయ్య అనే దళితుడు షార్జాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బచ్చల జమున తన బాధను రాహుల్‌తో పంచుకున్నారు.  



2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) 'అభయ హస్తం మేనిఫెస్టో' పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైలకు నాలుగు హామీలు ఇచ్చారు. ఎన్నారైల కోసం సంక్షేమ బోర్డు, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు, గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సానుభూతి మాటలు తప్ప ఆర్థిక సాయం అందించలేకపోయింది.

ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున వెంటనే ప్రభుత్వం రూ. గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు రాహుల్ పర్యటనలో ఇచ్చిన గల్ఫ్ హామీలను అమలు చేయాలని, రాహుల్ గాంధీ గౌరవాన్ని కాపాడాలని బీమ్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News