‘కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ప్రభుత్వమే సహకరించట్లేదు’

కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు.;

Update: 2025-07-11 08:18 GMT

కాళేశ్వరం కమిషన్ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి సహకారం అందించడం లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సమాచారం అంతా తమ దగ్గర ఉన్నా.. కమిషన్‌కు ఇవ్వడానికి సర్కార్ తచ్చట్లాడుతోందని విమర్శించారు. తాము అధికారంలో లేనందున తమ దగ్గర అన్ని పత్రాలు లేవని, ఉన్న సమాచారం మొత్తాన్ని కమిషన్‌కు అందించామని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై అదనపు సమాచారం అందించడానికి హరీష్ రావు.. శుక్రవారం బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు.

పీసీ ఘోష్ కమిష్‌కు తన వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందించారు. ఈ సందర్భంగానే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. అంతేకాకుండా కమిషన్‌ను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని మార్చి ఇస్తుందన్న అనుమానం కలిగిందని చెప్పారు. వాస్తవానికి కమిషన్‌కు అదనపు సమాచారాన్ని గురువారమే అందించాల్సి ఉందని, కానీ కేసీఆర్‌కు ఆరోగ్యం బాగోకపోవడంతో శుక్రవారం వస్తానని కమిషన్‌కు వివరించానని హరీష్ రావు చెప్పారు. అందుకు కమిషన్ అంగీకరించడంతోనే శుక్రవారం కమిషన్ ముందు హాజరయ్యానని ఆయన వెల్లడించారు.

‘‘ఇప్పుడు అధికారంలో మేము లేము. దస్త్రాలన్నీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. సమాచారం కోసం సీఎష్, జీఏడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాశాను. ఆ రోజుల్లో తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలు, క్యాబినెట్ నోట్ వంటి సమాచారం కావాలని లేఖలో అడిగాను. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకే మా దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని క్రోఢీకరించి ఒక నోట్ రూపంలో అందించాం. మా సమాచారం అధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. ఆరు సార్లు క్యాబినెట్ ఆమోదం పొందిన డాక్యుమెంట్లు కమిష‌న్‌కు అందించాం. అంతే కాదు మూడు సార్లు శాసన సభ ఆమోదం కూడా పొందింది. ఎప్పుడెప్పుడు జరిగాయి, జరిగిన చర్చ, ఇతర అంశాలను కమిషన్‌కు అందించాం. లెజిస్టేచర్ అప్రూవల్ క్యాబినెట్ కంటే కూడా ఉత్తమం అయినటువంటిది. ఆరు సార్లు క్యాబినెట్ అప్రూవల్ వివరాలను, మూడు సార్లు అసెంబ్లీ ఆమోదం, చర్చ వివరాలను కమిషన్‌కు డాక్యుమెంట్లతో సహా అందించాం’’ అని చెప్పారు హరీష్ రావు.

‘‘ఈ అంశంపై కమిషన్ విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా ఇప్పుడు వివరాలు బయటపెట్టలేదు. సమయం వచ్చినప్పుడు వివరాలన్నీ వెల్లడిస్తాను. ఇప్పుడు మేము అందించిన సమాచారం కన్నా ఇంకా అనేక వివరాలు ఉన్నాయి. కానీ వాటిని మేము అడిగినా ప్రభుత్వం మాకు అందించడం లేదు. క‌మిష‌న్‌కు అందించిన సమాచారం మాకు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. పారదర్శకంగా ఉండాలనుకుంటే మాకు ఆ వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు. క‌మిష‌న్‌ను తప్పుదోవ పట్టించేలా వివరాలను ఈ ప్రభుత్వం అందిస్తుందనే అనుమానం మాకు ఉంది’’ అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

‘‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట అబద్ధమే. 50 ఏళ్లుగా కాంగ్రెస్ చెప్పినవన్నీ అబద్ధాలే. చేసినవన్నీ మోసాలే. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కేటాయింపు కాంగ్రెస్‌ పాపమే. సెక్షన్‌ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని అప్పుడే అడిగారు. ప్రజా భవన్‌లో కాళేశ్వరంపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు...కవర్ పాయింట్ ప్రజెంటేషన్. సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానం, అహంకారం బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 299 టీఎంసీల పేరుతో శాశత్వ ఒప్పందమని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆ నాడే 299 టీఎంసీలకి ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే...సెక్షన్ 3 కోసం పోరాటం ఎందుకు చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు.

Tags:    

Similar News