Harish Rao | రోడ్డు పాలైన కుటుంబ సర్వే దరఖాస్తులు.. మండిపడ్డ హరీష్ రావు

నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు.. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు..

Update: 2024-11-22 14:34 GMT

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సమగ్ర కుటుంబ సర్వే(Caste Census)ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ సర్వేలో ప్రజలు ఇచ్చే సమాచారం అంతా కూడా అత్యంత గోప్యంగా ఉంచబడుతోందని మంత్రులు సైతం భరోసా కల్పించారు. కానీ శుక్రవారం నాడు.. ప్రజల వివరాలు ఫిల్ చేసిన సమగ్ర సర్వే దరఖాస్తులు రోడ్డుపై కనిపించడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్నాయి. ప్రజల సమాచారానికి ఈ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం అంటే ఇలా రోడ్డుపై పడేయటమేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను నమ్మించి సమాచారం సేకరించింది ఇలా రోడ్డు పాలు చేయడానికా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాడు అభయహస్తం దరఖాస్తులు, ఈరోజు కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్డెక్కాయంటూ విమర్వలు గుప్పించారు. ప్రజల నుంచి అధికారులు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం గోప్యత, భద్రతపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందని విమర్శలు గుప్పించారు.

ప్రజల వివరాలపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదేనా: హరీష్

‘‘నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు. నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం. రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతున్నది. సైబర్‌ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటన పట్ల సీరియస్ గా స్పందించాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీష్ రావు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు.

అభయ హస్తం దరఖాస్తుల విషయం ఏంటంటే..

ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ ప్రజాపాలన దరఖాస్తులు కూడా ఇదే విధంగా రోడ్డుపై పడి కనిపించాయి. ఈ అంశంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఈ దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనికి కారకులైన అధికారులు, సిబ్బందిపై జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హయత్ నగర్ డివిజన్‌కు సంబంధించిన దరఖాస్తులను డాటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్న క్రమంలో అవి రోడ్డుపై పడిపోయాయని, వాటిని అధికారి గ్రహించలేదని సమాచారం. కాగా హయత్ నగర్ సర్కిల్ పరిధిలో వాట్యుయేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మమేందర్ అనే అధికారిపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరణ ఇవ్వండి: కమిషనర్

‘‘దరఖాస్తుల నిర్లక్షం అంశంలో జోనల్ అధికారులు వివరణ ఇవ్వాలి. ఈ వ్యవహారానికి హయత్ నగర్ సర్కిల్-3లో పన్ను వసూళ్ల విభాగానికి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహేందర్‌ను బాధ్యుడిగా గుర్తిస్తున్నాం. ఈ నిర్లక్ష్యానికి గానూ అతనిని సస్పెండ్ చేస్తున్నాం. అదే విధ:గా కుత్బుల్లాపూర్‌లో అభయహస్తం దరఖాస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనిపించిన అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని కమిషనర్ రొనాల్డ్ రాస్ వెల్లడించారు.

ప్రజాపాలన ధరకాస్తులు పోవడానికి ఇదే కారణం..

ఎవరో ర్యాపిడోలో బుక్ చేస్తే తాను తీసుకెళ్తుండగా ప్రజాపాలన దరఖాస్తులు కింద పడిపోయాయని వాహనదారుడు వివరించాడు. అతని దగ్గర దాదాపు 500కు పైగా దరఖాస్తులు ఉన్నాయని స్థానికులు చెప్పారు. పైగా అవి హయత్ నగర్ సర్కిల్ పేరు రాసి ఉన్నాయని కూడా వివరించారు. అయితే వీటిని ఇంతదూరం ఎవరు తీసుకెళ్తున్నారని స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంత దూరం ఈ దరఖాస్తులను ఎందుకు తీసుకెళ్తున్నారని, ఇంతటి ముఖ్యమైన దస్త్రాలను ర్యాపిడోలో బుక్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు వెల్లడించిన అత్యంత గోప్యమైన సమాచారానికి ప్రభుత్వం, అధికారులు ఇచ్చే విలువ ఇదేనా అని స్థానికులు, ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వివరాలు ఇంకెందరి చేతుల్లోకి వెళ్లాయని, అసలు తమ సమాచారం గోప్యంగా ఉంటుందని తాము ఎలా నమ్మాలని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇప్పుడు కుటుంబ సర్వే దరఖాస్తులు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News