‘వసూళ్లు బాగా చేసినందుకా ఈ విజయోత్సవాలు రేవంత్’

23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు.

Update: 2025-10-17 13:46 GMT

కాంగ్రెస్ విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారని విజయోత్సవాలు నిర్వహించాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినందుకా? మంత్రులు పాలనలను గాలికి వదిలేసి తగాదాలు ఆడుకుంటున్నందుకా? అని పలు ప్రశ్నలు సంధించారు. లేదా క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను పక్కనబెట్టి గల్లాలు పట్టుకుని కొట్టుకున్నందుకా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం సాధించిందని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతోంది? అని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్నా ఏమీ చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం ఈ ప్రభుత్వానికే సాధ్యమైందని చురకలంటించారు.

23 నెలల్లో ఏం చేశారు..?

‘‘కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టితే ఆగం చేసారు రేవంత్. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేదు, 420 హామీల అమలు ఊసు లేదు, అసలు ఏం చేసావని విజయోత్సవాలు? రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికీ “ఆత్మీయ భరోసా” ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి, సన్నాలకే పరిమితం చేసినందుకా? ₹1300 కోట్ల బోనస్ డబ్బులు ఇప్పటికీ రైతులకు చెల్లించకపోయినందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని యువతను మోసం చేసినందుకా? నిరుద్యోగ భృతి ఎగ్గొడుతున్నందుకా? “మహాలక్ష్మి” పేరిట నెలకు ₹2500 ఇస్తానని చెప్పి ఇప్పటికీ అమలు చేయనందుకా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకా? అవ్వాతాతలకు పెన్షన్‌లు పెంచనందుకా? “హైడ్రా” పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకా? “మూసీ సుందరీకరణ” పేరుతో కమీషన్లు దండుకుంటున్నందుకా? ఎందుకు విజయోత్సవాలు చేస్తావు రేవంత్ రెడ్డి’’ అని ప్రశ్నలు సంధించారు.

దండుపాళ్యం బ్యాచ్‌లా మంత్రులు..

కాంగ్రెస్ హయాంలో క్యాబినెట్ దండుపాళ్యం ముఠాను మించిపోయిందని విమర్శించారు హరీష్. ‘‘మంత్రులు గ్రూపులుగా విడిపోయి కమీషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లలో వాటాలు, కబ్జాల కోసం తన్నుకుంటూ దండుపాళ్యం ముఠాకంటే దారుణంగా తయారైంది. అందుకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశం అతిపెద్ద ఉదాహరణ. అందినకాడికి దోచుకోవడానికి మంత్రులు తెగబడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

వారికి బీఆర్ఎస్ అండ

‘‘పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, సినిమా పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారలు, పేదలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మిమ్మల్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురండి. మేము కాపాడతాం. పోరాడతాం. మీకోసం తెలంగాణ భవన్ తలుపు 24 గంటలు తెరిచి ఉంటాయి. డీజీపీ శివధర్ రెడ్డి.. ఖాకీ బుక్‌లో మంత్రులకు వేరే రూల్స్ ఉన్నాయి. టెండర్లు వేయొద్దని మంత్రులు బెదిరిస్తున్నా, సీఎం సన్నిహితులు తుపాకులతో తిరుగుతున్నా వారిపైన కేసు లేదు. ఒక సోషల్ మీడియా పోస్ట్‌ను రీపోస్ట్ చేసినా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు’’ అని విమర్శించారు.

Tags:    

Similar News