‘ప్రజలకు తాగునీరు అందించలేని దద్దమ్మ ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం అందించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంగా డయేరియా బారిన పడటంపై హరీష్ రావు స్పందించారు. దీనికి రేవంత్ ప్రభుత్వం చేతకాని తనమే కారణమన్నారు. రేవంత్ అసమర్థ పాలనకు ఈ ఘటన అద్ధం పడుతోందన్నారు.
డయేరియా కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేమికలాన్ గ్రామంలో డయేరియా ఘటనలో అన్ని శాఖలు విఫలమయ్యాయన్నారు హరీష్ రావు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్, నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ శాఖ విఫలమయ్యాయని అన్నారు.
అసలేం జరిగిందంటే..
దేమికలాన్ గ్రామంలోని ప్రజలంతా మూడు రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాంతులు, విరేచనాలతో అవస్థలు పడుతున్నారు. వారికి డయేరియా సోకినట్లు వైద్యులు తెలిపారు. దీని కారణంగా ఇప్పటికే ఇద్దరు మరణించారు. పదుల సంఖ్యలో గ్రామస్తులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తామంతా కూడా మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెప్తున్నారు. పరిస్థితి విషమించడంతో కొందరు ఆసుపత్రులకు పరుగులు పెట్టారని, అప్పుడే వారికి డయేరియా సోకినట్లు తేలిందని స్థానికులు వివరించారు.