‘రేవంత్.. ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారు’
ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది.;
తెలంగాణలో ప్రశ్నించే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై పగబట్టి మరీ ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. అన్ని వర్గాలపనా ఆంక్షలు విధించడం కాంగ్రెస్‌కు నిత్యకృత్యం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం’లో ఏర్పాటు చేసిన నోటీసులను ఉద్దేశించి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఘాటు పోస్ట్ పెట్టారు.
‘‘ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీ ల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదు రేవంత్ రెడ్డి’’ అని హితవు పలికారు.
‘‘ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం అంతా లైబ్రరీల చుట్టే జరిగింది. రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా? అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తు వచ్చాయా? గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా? ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక విధంగా, అధికారం పక్షంలోకి రాగానే మరొక విధంగా వ్యవహరిస్తారా?’’ అని ప్రశ్నించారు.
‘‘ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నది. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా? జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేశారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. 20నెలల్లో 12వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నవు’’ అని విమర్శించారు.
‘‘నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని పోస్ట్ పెట్టారు.