‘చెప్పిన అబద్ధాల్లే మళ్లీ చెప్తున్నారు హరీష్’

ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-08-31 13:34 GMT

కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ రావు తీరుపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు వాస్తవాలు మాట్లాడటం లేదని, చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారని చురకలంటించారు. ‘‘ఆనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికీ మంత్రిగా ఉన్నట్టుగానే భావిస్తున్నారు. నీరు అందుబాటులో ఉందని చెప్పినా మళ్లీ పరిశీలించాలని లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించకుండా.. పేరు మార్చి ఊరు మార్చి దోపిడీకి పాల్పడ్డారు’’ అని రేవంత్ ఆరోపించారు.

‘‘అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్లలో నీరు అందుబాటులో ఉంది, హైడ్రాలజీ అనుమతులు ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి 24-10- 2014 న స్పష్టంగా చెప్పారు. 205 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని లెటర్ రాస్తే.. హరీష్ రావు మళ్లీ పటిశీలించాలని మళ్లీ లేఖ రాశారు. వీళ్ల తప్పుడు విధానాలతో మళ్లీ పటిశీలించాలని లేఖ రాశారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికెట్ తీసుకున్నాక మళ్లీ పరిశీలించాలని ఎవరైనా అడుగుతారా. 2009 లో కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీరు అందుబాటులో ఉందని అనుమతి నిచ్చింది. ఈ రికార్డులను కావాలనే ఆనాటి బీఆరెస్ ప్రభుత్వం తొక్కిపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో వాస్తవాలని బయటపెట్టారనే వారిపై విషం చిమ్ముతున్నారు. హరీష్ రావు తప్పు చేశారని నివేదికలోని పేజీ నెంబర్ 98 లో స్పష్టంగా పొందుపరిచారు. సీబీఐ కావాలా, సీబీ సీఐడీ కావాలా ఆర్ విచారణ కావాలో చెప్పకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసంపూర్తి సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతున్నా’’ అని రేవంత్ డిమాండ్ చేశారు. 

‘‘2014 లో నీరు అందుబాటులో ఉందని చెప్పిన విషయం దాచి 13 మార్చి 2015 న ఉమా భారతి లేఖను పట్టుకుని హరీష్ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాసాగర్ రావు బతికి ఉంటే వీళ్ల అబద్ధాలు వినలేక అదే కాలేశ్వరంలో దూకి ఆత్మహత్య చేసుకునేవారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారు. నిజాం కంటే ధనవంతుడు కావాలన్న దుర్బుద్ధితో కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్, హరీష్ ముందే నిర్ణయించుకున్నాక రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీని నియమించారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక వారికి అనుకూలంగా లేదని ఆ నివేదికను తొక్కిపెట్టి వాళ్లు అనుకున్న చోట ప్రాజెక్టు కట్టారు. వీళ్ల ఉద్దేశమే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం. వీళ్ల ప్రణాళికలకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అడ్డు చెబితే ఆ నివేదికను కనిపించకుండా మాయం చేశారు’’ అని అన్నారు రేవంత్.

Tags:    

Similar News