కేటీఆర్ తో హరీష్ పోటీ
రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలనే డిమాండుతో పాదయాత్ర చేయాలని హరీష్(Harish) నిర్ణయించారు.;
బావ, బావ మరుదులు కేటీఆర్, హరీష్ మధ్య పోటీ మొదలైనట్లే ఉంది. పోటీలో కేటీఆర్ కన్నా హరీష్ ఒకడుగు ముందున్నట్లున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే హరీష్ రావు పాదయాత్ర చేయబోతున్నారు. రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాలనే డిమాండుతో పాదయాత్ర(Padayatra) చేయాలని హరీష్(Harish) నిర్ణయించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలన్నది హరీష్ డిమాండ్. పాదయాత్రయితే చేయాలని డిసైడ్ చేశారు కాని ఎప్పుడు మొదలుపెట్టాలన్న విషయంలోనే ఆలోచిస్తున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికలకు పాదయాత్ర క్లాష్ వస్తుందేమో అని మాజీమంత్రి ఆలోచిస్తున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికలు వెంటనే నిర్వహించేట్లయితే అవి అయిపోయిన తర్వాత పాదయాత్ర ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఒకవేళ స్ధానికసంస్ధల ఎన్నికలు ఏప్రిల్-మేలో ఉండేట్లయితే ఈనెలలోనే పాదయాత్రను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకనే లోకల్ బాడీ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనను తెలుసుకోవటం కోసమే హరీష్ వెయిట్ చేస్తున్నారు. ఈమధ్య ఫామ్ హౌస్ లో జరిగిన సీనియర్ నేతల సమావేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం హరీష్ ఆందోళనలు చేస్తారని పార్టీ అధినేత కేసీఆర్(KCR) ప్రకటించిన విషయం తెలిసిందే. దాని తర్వాతే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులతోనే పాదయాత్ర రూపంలో ఆందోళనలు మొదలుపెట్టాలని హరీష్ డిసైడ్ అయ్యారు. స్ధానికసంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆంధోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 397 గ్రామాల్లో సుమారు 4 లక్షల ఎకరాలకు పై రెండు ప్రాజెక్టులు సాగునీటిని అందిస్తాయి. 4 లక్షల ఆయకట్టుకు సాగునీటిని అందించే రెండు ప్రాజెక్టుల విషయంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ రెండు ప్రాజెక్టులకు 2022, ఫిబ్రవరి 21వ తేదీన కేసీఆరే శంకుస్ధాపన చేశారు. తర్వాత భూసేకరణ జరిగి ఎందుకనో ప్రాజెక్టుపనులు ముందుకుసాగలేదు. అంటే, కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టుపనులు ముందుకు జరగలేదన్నది వాస్తవం. అయితే తమ హయాంలో ఏమిజరిగిందన్నది మాట్లాడకుండా హరీష్ ఎంతసేపు రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాత్రమే పదేపదే ఆరోపిస్తున్నారు.
పాదయాత్ర రూట్
తొందరలోనే మొదలవ్వబోయే పాదయాత్రలో రోజుకు సుమారు 20కిలోమీటర్లు నడవాలని హరీష్ నిర్ణయించుకున్నారు. ఆరురోజుల్లో 130 కిలోమీటర్లు నడవబోతున్నారు. పాదయాత్రను ఝురాసంగం మండలంలోని కేతకి సంగమేశ్వర ఆలయం దగ్గర ప్రారంభించి నారాయణఖేడ్ లోని బసవేశ్వర విగ్రహం దగ్గర ముగించాలని ప్లాన్ చేశారు. దాదాపు వారంరోజులు సాగే పాదయాత్రలో ప్రతిరోజు ఒకసభ నిర్వహించబోతున్నారు. బసవేశ్వర విగ్రహం దగ్గర పాదయాత్ర ముగింపులో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ బహిరంగసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. పై నాలుగు నియోజకవర్గాల్లోని పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, క్యాడర్ అంతా పాల్గొనేట్లుగా హరీష్ మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు.
హరీష్ పాదయాత్ర అయితే కన్ఫర్మ్డ్, కాకపోతే ముహూర్తం అన్నది స్ధానికసంస్ధల ఎన్నికల ప్రకటనపైన ఆధారపడుందంతే. ఒకపుడు కేటీఆర్(KTR) కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేయాలని ప్లాన్ చేశారు. అయితే పాదయాత్రను ఎప్పుడు మొదలుపెడతారు ? ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ ముగిస్తారన్న విషయంలో క్లారిటీలేదు. పాదయాత్ర చేయాలని అనుకుంటున్న విషయాన్ని ఒకపుడు కేటీఆరే స్వయంగా ప్రకటించారు. దాని తర్వాత ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఇంతలో బావ హరీష్ రావు పాదయాత్ర ప్లాన్ సడెన్ గా బయటకు వచ్చింది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేటీఆర్ పాదయాత్రకన్నా ముందే హరీష్ పాదయాత్ర మొదలవ్వచ్చని అర్ధమవుతోంది. పైగా హరీష్ పాదయాత్ర పరిమితమైన దూరమే. రెండు ప్రాజెక్టుల కోసం నాలుగు నియోజకవర్గాల్లో 130 కిలోమీటర్లు మాత్రమే పాదయాత్ర చేయబోతున్నారు. ఏదేమైనా ప్రజాసమస్యల మీద పాదయాత్ర అంటే పాదయాత్రే కదా.
Te